ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. ఇప్పటినుంచే ఈ సినిమా రికార్డులు, కలెక్షన్ల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఈ సినిమా విడుదలైతే అటు కలెక్షన్ల పరంగా.. ఇటు సినిమా కథ పరంగా తప్పకుండా ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాయడం ఖాయమని ప్రభాస్ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలు వేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం కూడా గట్టిగా పోటీ నెలకొన్నట్లు సమాచారం. సలార్ ఓటీటీ రైట్స్ సుమారుగా రూ.200 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం.
దక్షిణాదితో పాటు హిందీ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఒక ఓటీటీ రైట్స్ ద్వారానే ఈ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో 60 % వరకు రికవరీ అయినట్టు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ , శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాతలకు వచ్చేదంతా లాభమేనని చెబుతున్నారు.
జూలై 6 తేదీన సలార్ టీజర్ విడుదల చేయగా 24 గంటల్లోనే 83 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఒక్కరోజులోనే హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమా టీజర్ గా కూడా రికార్డు సృష్టించింది. సలార్లో మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండగా జగపతిబాబు, శృతిహాసన్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు.