ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోల కెరీర్‌లో హిట్ చిత్రాలు మరోసారి రీ రిలీజ్ అవుతున్నాయి. ఇదే కోవలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రేక్షకులు ఎంతగానో మెచ్చిన తొలి ప్రేమ సినిమాను రీ రిలీజ్ చేశారు. అయితే విజయవాడలో పవన్ అభిమానులు రెచ్చిపోయారు. సినిమాను ప్రదర్శించిన కపర్ది థియేటర్‌లో రచ్చ రచ్చ చేశారు. కుర్చీలు విరగ్గొట్టడంతో పాటు థియేటర్‌లో స్క్రీన్ చించేశారు. దీంతో రీరిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నట్లయింది థియేటర్ యజమాని పరిస్థితి.
తొలి ప్రేమ రీ రిలీజ్ తో ఇరు తెలుగు రాష్ట్రాలలో దానిని ప్రదర్శించిన అన్ని థియేటర్ల యజమానులకు లాభాలు వచ్చాయి. అయితే కపర్ది థియేటర్ యజమాని మాత్రం తనకు రూ.6 లక్షల నష్టం జరిగిందని వాపోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, జనసేన పార్టీ అధినేతగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని వారాహి యాత్ర చేపడుతున్నారు.
ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. ఇలాంటి తరుణంలో జరిగిన ఈ ఘటన ఆయన ప్రతిష్టను తగ్గించేదిగా ఉంది. తొలి ప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దీనిని శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. 25 ఏళ్ల తర్వాత ఈ సినిమా 4కేలో రీరిలీజ్ అయింది.
ఇన్నేళ్లయినా దీనికి స్పందన ఏ మాత్రం తగ్గలేదు. ప్రేక్షకులు భారీగా థియేటర్లకు తరలి వచ్చారు. దీనిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో పోస్టులు పోటెత్తాయి. ఇక థియేటర్లలో అయితే ప్రేక్షకుల హడావుడి మామూలుగా లేదు. ప్రతి సన్నివేశానికి ఈలలు, గోలలు చేస్తూ థియేటర్లను దద్దరిల్లిపోయేలా చేశారు.
ఇక 1998లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాను కరుణాకరన్ తెరకెక్కించారు. పవన్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఇది జాతీయ చలనచిత్ర అవార్డును సాధించింది. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల్లో 21 థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇందులో క్లైమాక్స్ నేటికీ ఓ మరుపురాని సన్నివేశం.