అంజి. బ్లాక్ అండ్ వైట్ మూవీల రోజుల్లో సెకండ్ కమెడియన్ పాత్రల్లో పేరు తెచ్చుకున్న ఉత్తమ కమెడి యన్. మన తెలుగులో ఉన్న పేరు కంటే కూడా తమిళ సినిమాల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఏకం గా మహానటి సావిత్రమ్మతమ్ముడు అని పిలుచుకునేవారట. అంతేకాదు.. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు. దీంతో నువ్వు-నేను ఒకటే తమ్ముడూ అని సావిత్రి ఆటపట్టించేవారట.
ఇదిలావుంటే.. అంజి అత్యంత పేదరికంగా ఉన్న సమయంలోనే ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. ఆయ న కనీసం 5వ తరగతి కూడా చదువుకోలేదు. కానీ… లెక్కల విషయంలో మాత్రంఆయన చాలా స్పష్టంగా ఉండేవారట. పెన్ను పేపర్ అవసరంలేకుండా.. నిర్మాతలకు ఎంతో సాయం చేసేవారట. దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ వంటివారు.. అంజి లెక్కలు చూశాడా! అని మేనేజర్‌ను అడిగే స్థాయికి వరకు అంజి ఎదిగారంటే అర్ధం చేసుకోవచ్చు.
అన్నీ నోటిమీదే లెక్కలు వేసేవారట. ఆ స్థాయిలో మళ్లీ రేలంగి ఉండేవారు. ఈయనకు కూడా ఆడిటర్లు ఉన్నా.. బ్రహ్మయ్య అండ్ కంపెనీ వారు చూసేవారు. రేలంగి స్వయంగా లెక్కలు విని.. తేడాలు చెప్పేవారట. అంతటి పరిజ్ఞానం అంజి, రేలంగి దగ్గర ఉండేది. అయితే.. ఆయన చివరి దశలో మోస పోయారు. సహ నిర్మాతగా (పేరు లేకుండా) కొన్ని సినిమాలు చేసి.. నష్టపోయారు.
దీంతో చివరి దశలో ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు కూడా లేకుండా ఉన్న విషయం అన్నగారికి తెలిసింది. నిజానికి ఆర్థిక క్రమ శిక్షణ లేకపోతే.. అన్నగారు ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వరు. కానీ, అంజి విషయంలో అన్నగారు అప్పటికిప్పుడు లక్ష రూపాయలు పంపించి.. ఆదుకున్నారు. దీనికి కారణం.. అంజిలో ఆర్థిక క్రమ శిక్షణ లేకపోవడం కాదు… ఆర్థికంగా నష్టాలే ఉన్నాయని అన్నగారు నమ్మడమేనని గుమ్మడి రాసుకున్నారు.