ఎన్టీఆర్ ‘ బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర ‘ సినిమా వెన‌క బాల‌కృష్ణ‌… మేన‌క‌, శ‌కుంత‌ల‌గా ఆ ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు..!

ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. కానీ, ఆయ‌న గురించి ఎంత చెప్పుకొన్నా.. ఎక్క‌డో ఒక చోట ఏదో చిత్ర‌మైన విష‌యం దాగి ఉండే ఉంటుంది. అలాంటివాటిలో ఇది కూడా ఒక‌టి. అన్న‌గారు సినిమా రంగంలో ఎంత వెలుగు వెలిగారో.. అంతే.. అన్ని ఫ్రేమ్స్‌లోనూ.. త‌న స‌త్తా చాటుకున్నారు. సీతా రామ క‌ళ్యాణం వంటి పౌరాణిక సినిమాతో అన్న‌గారి ప్ర‌భ విదేశాల‌కు కూడా చేరిందంటే ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది.

ఇక‌, అన్న‌గారి జీవితంలో మ‌రో మేలి మలుపుగా మిగిలిన సినిమా.. బ్ర‌హ్మర్షి విశ్వామిత్ర‌. ఈ సినిమాకు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఇది అన్న‌గారు.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌డానికి ముందు.. వేసుకున్న షెడ్యూల్‌. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే.. అనేక పౌరాణిక క‌థ‌ల‌ను అన్న‌గారు తెర‌పై ఎక్కించారు. ఇలాంటి వాటిలో బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర ఒక‌టి. దీనిని రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ముందే స్క్రిప్టు రెడీ చేసుకున్నారు.

అంతేకాదు.. జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ‌ల‌ను కూడా ఇద్ద‌రు హీరోయిన్లుగా (మేన‌క‌, శ‌కుంత‌ల‌) అనుకున్నారు. కానీ, అనూహ్యంగా అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. వ‌చ్చీరావ‌డంతో సీఎంకూడా అయిపోయారు. ఇక‌, ఈ స్క్రిప్టు ప‌క్క‌న పెట్టేశారు. మ‌ళ్లీ సుమారు 7 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఈ సినిమాను ప‌ట్టాలెక్కించారు. ఇక‌, మొత్తం సినిమాలో అన్నీ అన్నగారే కావ‌డం.. గ‌మ‌నార్హం. ద‌ర్శ‌క‌త్వం నుంచి స్క్రీన్‌ప్లే వ‌ర‌కు.. న‌ట‌న నుంచి ఎడిటింగ్ వ‌ర‌కు.. అన్నీ అన్న‌గారే చూసుకున్నారు.

దీంతో దాస‌రి నారాయ‌ణరావు లాంటి అగ్ర‌ద‌ర్శ‌కులు.. సినిమాపై స‌టైర్లు వేసేవారు. సినిమాలో క‌థ ఎలా ఉన్నా.. మొత్తం రెండు గంట‌ల సినిమా అంతా రామారావే క‌నిపించారు అనేవారు. ఇక ఈ సినిమాలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్ (ప్ర‌స్తుతం అగ్ర‌హీరో) భ‌ర‌తుడిగా తొలి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, రామారావు రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో సినిమా పోస్టు ప్రొడ‌క్ష‌న్ అంతా కూడా.. బాల‌కృష్ణ చూసుకున్నారు. అయితే.. ఈ సినిమా అనుకున్నంత వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక పోయింద‌ని అంటారు.