నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర.. అన్ని వర్గాలకు భరోసా ఇస్తోందనే వాదన వినిపిస్తోంది. నిజానికి.. పాదయాత్ర అంటే.. నేరుగా నడుచుకుంటూ.. వెళ్లిపోయి ఏదో ఒక కూడలిలో సభ పెట్టి.. నాలుగు మాటలు.. పది విమర్శలు చేసి.. కిలో మీటర్లు లెక్కించుకునే పరిస్థితి చాలా మంది చేశారు. అయితే.. దీనికి భిన్నంగా.. నారా లోకేష్.. స్థానిక సమస్యలు.. స్థానిక ప్రజలు.. అనే కాన్సెప్టును అమలు చేస్తున్నారు.
వారి సమస్యలు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. స్థానికుల నుంచి వచ్చే అర్జీల ను ఆయన పరిశీలిస్తున్నారు. అదేవిధంగా వాటిపై వెంటనే రియాక్ట్ అవుతున్నారు. తనదైన శైలిలో వారికి హామీలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా రైతులు, మహిళలు, న్యాయవాదులు, కార్మికులు, చేతి వృత్తుల వారు.. ఇలా.. అనేక వర్గాలకు చెందిన వారితో భేటీ అయి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
తాము అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. ఈ పరిణామం.. ఆయా వర్గాల్లో భరోసా నింపుతుండడం గమనార్హం. అంతేకాదు.. నారా లోకేష్ గతంలో మంత్రిగా కూడా చేసిన నేపథ్యంలో ఆయన చెప్పేదానికిపైనా ఆయా వర్గాల ప్రజలకు నమ్మకం కలుగుతోంది. మంత్రి గా క్షేత్రస్థాయిలో పాలనను దగ్గరగా చూసిన దరిమిలా.. భవిష్యత్తులో తమకు సాయం చేయడం ఖాయమనివారు భావిస్తు న్నారు.
ఇక, మహిళలు, రైతులకు కూడా నారా లోకేష్ భరోసా కల్పిస్తుండడం గమనార్హం. వివిధ కుల వృత్తుల వారికి.. కూడా నారా లోకేష్ అనేక హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గం పరంగా ఒకింత వెనుకబడిన యానాది వర్గాలకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశంతోపాటు.. వారికి కార్పొరేషన్ ఏర్పాటు సహా దామాషా పద్ధతిలో నిధులు కూడా వెచ్చిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇలా.. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా యువగళం ముందుకు సాగుతోందనడంలో సందేహం లేదు.