టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నేటికి 150వ రోజుకు చేరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ యువ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 27న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో భారీ అంచనాల నడుమ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. అనుకున్న విధంగానే ఇది సక్సెస్ అయిందని.. ఇప్పటికి 150 రోజులకు చేరిందని పార్టీ సీనియర్లు సంబరాలు చేసుకుంటున్నారు.
తొలినాళ్లలో అడ్డంకులు..
అయితే..యువగళం పాదయాత్ర చిత్తూరులో ప్రారంభమయ్యాక.. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సాగు తున్న సమయంలో సర్కారు సహా వైసీపీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున అడ్డంకులు ఎదురయ్యారు. పోలీసులు అనేక సందర్భాల్లో యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు నారా లోకేష్ ప్రసంగించే మైకులు ఎత్తుకుపోయారు. ఆయన నిలబడేందుకు ఏర్పాటు చేసుకున్న స్టూల్‌ను కూడా పోలీసులు ఎత్తుకుపోయారు.
అయినప్పటికీ.. గాంధీ మార్గంలో నారా లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. ఇక, పాదయాత్రపై క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకున్న వైసీపీ ప్రభుత్వం తాము అడ్డుకుంటున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గ్రహించి.. కర్నూలు జిల్లాలో ప్రవేశించిన దరిమిలా.. ఇక, దూకుడు తగ్గించింది. ఇక, అప్పటి నుంచి యువగళం సజావుగా సాగుతోంది. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు కూడా.. భారీ ఎత్తున నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. గజమాలలతో ఎదురేగి స్వాగతించారు.
మరోవైపు.. అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్ర చేరువైంది. పలు సందర్భాల్లో నారా లోకేష్‌కు నందమూరి ఫ్యామిలీ నుంచి మద్దతు కూడా లభించింది. ఆయన మాతృమూర్తి.. భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి నుంచి నందమూరి కుటుంబానికి చెందిన మహిళలు, రామకృష్ణ వంటివారు కూడా తరచుగా వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా.. మూడు సార్లు పాదయాత్ర లో పాల్గొన్నారు. అనుకున్న షెడ్యూల్ కంటే కూడా చాలా వేగంగా పాదయాత్ర సాగుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు.