తెలుగు చిత్ర సీమలోనే కాకుండా.. తమిళంలోనూ హిట్ అయిన కాంబినేషన్ అక్కినేని నాగేశ్వరరావు.. సా విత్రి. వీరిద్దరి సినిమాలను దేవదాసు నుంచి పరిశీలిస్తే.. దాదాపు 60 దాకా ఉన్నాయి. ప్రతి సినిమా కూడా హిట్ సాధించింది. అంతేకాదు.. నాగేశ్వరరావు – సావిత్రి కాంబినేషన్ కోసం.. నిర్మాతలు, దర్శకులు కూడా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి సినిమాలను వాయిదా కూడా వేసుకున్నారు.
ఇప్పుడు.. ఉన్నట్టుగా అప్పట్లో డిజిటల్ ప్రచారాలు ఉండేవి కాదు. గ్రామాల్లో అయితే.. మనుషులతో ఆయా సినిమాల గురించి చాటింపు వేయించే వారు. అదేవిధంగా.. ఎద్దుల బళ్లపై పోస్టర్లు అంటించి తిప్పేవారు. ఇక, నగరాలు.. పట్టణాల్లో అయితే.. ఆటో రిక్షాలకు మైకులు కట్టి ప్రచారం చేసేవారు.. ఈ ప్రచారంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి పేర్లను ప్రధానంగా వివరించేవారు.
దీంతో ప్రేక్షకులు.. సినిమా హాళ్లకు క్యూ కట్టేవారు. ఇదిలావుంటే.. ఎన్నో ఆశలతో వచ్చిన సగటు ప్రేక్షకుడు ఒక్కోక్కసారి నిరుత్సాహ పడిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా బాగోక కాదు. సినిమాలో హీరో, హీరోయిన్లు వీరే అనుకుని వచ్చిన ప్రేక్షకులకు.. నిరాశ కలిగించిన పాత్రలు ఉండేవి. డాక్టర్ చక్రవర్తి, మనుషులు.. మమతలు.. సహా పలు సినిమాల్లో సావిత్రి సరసన కొంగర జగ్గయ్యకు కీలక పాత్రలు దక్కేవి.
దీంతో ఆయా సినిమాల్లో నాగేశ్వరరావు పేరుకే హీరో. అంతే తప్ప.. డ్యూయెట్ ఉండేది కాదు… కనీసం భార్యాభర్తలుగా కూడా నటించేవారు కాదు. ముఖ్యమైన పాత్ర ధారులు అంతే. ఇది.. ఒకరకంగా. ఎన్నో ఆశలతో థియేటర్‌కు వచ్చిన సగటు ప్రేక్షకుడికి తీవ్ర నిరాశ మిగిల్చేదట.