మోహన్ బాబు ఫ్లాప్ సినిమాకు బాల‌య్య ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఉన్న లింక్ ఇదే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి ఇప్పటిదాకా తీసిన వాటిలో పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎఫ్‌3 కూడా బాగానే ఆడింది. ఇన్ని సక్సెస్‌లు అందుకున్న డైరెక్టర్‌తో బాలకృష్ణ జాయిన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి.

బాలయ్యను అనిల్ ఎలాంటి అవతారంలో చూపిస్తాడేమో తెలుసుకోవాలని వారు మొదటినుంచి తపన పడుతున్నారు. ముఖ్యంగా మూవీ స్టోరీ ఏంటని తెలుసుకోవడానికి వారు కుతూహల పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ బయటికి వచ్చింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం, బాలకృష్ణ తీస్తున్న ఈ మూవీ గతంలో మోహన్ బాబు తీసిన స్టోరీతోనే వస్తోందట.

మోహన్ బాబు తీసిన ఆ మూవీ పేరు రాయుడు. ఇది రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1998లో విడుదలైంది. ఇది నిజానికి తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వల్లల్’ అనే సినిమాకి రీమేక్. అయితే ఈ సినిమా కంటే మూడేళ్లకు ముందే రవి రాజా పినిశెట్టితో కలిసి మోహన్ బాబు పెదరాయుడు సినిమా తీశాడు. ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.

మళ్లీ మోహన్ బాబు రాయుడు సినిమా కోసం రవిరాజా పినిశెట్టితో చేతులు కలపడంతో ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో మోహన్ బాబుకి కుమార్తెగా ప్రత్యూష కనిపించింది. అయితే చివరిలో ఆమె మోహన్ బాబుకు పెంచుకున్న కూతురు అవుతుందని చూపించారు. ఇది ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది. ఇక క్లైమాక్స్ కూడా పెద్దగా బాగోలేకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే అచ్చం ఇదే కథతో బాలయ్య బాబు అనిల్ రావిపూడి సినిమా వస్తోందని ఇన్సైడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మోహన్ బాబు కూతురుగా ప్రత్యూష నటిస్తే, బాలయ్య బాబు కూతురుగా శ్రీలీల నటిస్తుందని ప్రచారం సాగుతోంది. శ్రీ లీల బాలకృష్ణకి సొంత కూతురు కాదనే ట్విస్టు లాస్ట్ లో రివిల్ చేస్తారని టాక్ నడుస్తోంది. అయితే రాయుడు సినిమా లాగా కాకుండా భగవంత్ కేసరి చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తుందని, అందువల్ల ఇది బాక్సాఫీస్ వద్ద తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఫ్లాపైన సినిమా స్టోరీతో బాలయ్య బాబు భగవంత్ కేసరి తీస్తున్నాడన్న టాక్‌తో నంద‌మూరి ఫ్యాన్స్‌లో చిన్న టెన్ష‌న్ ఉంది. అయితే అనిల్ రావిపూడి టేకింగ్‌పై అంద‌రిలోనూ న‌మ్మ‌కం ఉంది.