టాలీవుడ్లో ఒకప్పుడు కలెక్షన్ కింగ్‌గా, డైలాగ్ కింగ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న సీనియర్ హీరో మంచు మోహన్ బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తరువాత నటుడిగా స్క్రీన్ పేరు వేయాలనుకున్నప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు మోహన్ బాబు అని పేరు మార్చారని అయన చాలా సందర్భాల్లో చెప్పుకు రావడం మనం చూసాం.
దాంతో మోహన్ బాబు పేరుతోనే ఆయన వెలుగొందాడు. ఆయన పేరు మాదిరిగానే ఆయనకి మొదటి భార్యకి సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మోహన్ బాబుకి విద్యాదేవి అనే ఆమెతో వివాహం జరిగింది. వీరి సంతానంగా మంచు విష్ణు, లక్ష్మీ ఇద్దరు పుట్టారు. ఆ తరువాతనే మోహన్ బాబు వరుసగా సినిమా అవకాశాలు వస్తుండడంతో చాలా బిజీ ఆర్టిస్ట్‌గా మారారని చెబుతారు.
ఇక ఆ సమయంలో మోహన్ బాబు షూటింగ్ ముగించుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చే వారట. అది భార్య విద్యాదేవికి అంతగా నచ్చేది కాదట. ఈ తరుణంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు అనేవి జరిగేవట. ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరి మధ్య చాలా తీవ్రస్థాయిలో గొడవ జరిగిందట. ఆ సమయంలో ముక్కోపి అయిన మోహన్ బాబు ఆమెని బాగా తిట్టడంతో ఓ రోజు ఆమె ఆత్మహత్య చేసుకుంది. తరువాత క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి మోహన్ బాబు చాలా విచారించాడట.
తనని అలా తిట్టకపోయుంటే మరోలా ఉండేదేమో అని ఇప్పటికీ ఆయన పశ్చాత్తాపపడతాడని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు. ఆమె చనిపోయిన నాటికి విష్ణు, లక్ష్మీ చిన్న పిల్లలు కావడంతో వారికి తల్లి లేని లోటు ఉండకూడదని మోహన్‌బాబు విద్యాదేవి సోదరి నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వీరికి మనోజ్ పుట్టిన సంగతి విదితమే. తరువాత నిర్మలాదేవి ఎలాంటి బేధభావం లేకుండా అక్క పిల్లలు అయిన విష్ణు, లక్ష్మీలను మనోజ్‌తో సమానంగా చూస్తోంది.
ఇక మోహన్ బాబు కెరీర్‌లో జరిగిన ఈ ఘటన మాత్రం ప్రేక్షకుల్లో చాలా తక్కువ మందికి తెలిసిన విషయమనే చెప్పుకోవాలి. దీనిపైన ఎన్నో వదంతులు ఉంటాయి. కానీ ఇదే నిజమని అంటూ వుంటారు. తొలుత అతికోపం ఉన్న మోహన్ బాబు నిర్మలాదేవితో పెళ్లి జరిగిన తరువాత క్రమక్రంగా కోపం తగ్గింది. అయితే ఏ విషయాన్ని అయినా సరే మోహం మీదే మాట్లాడేతత్వం మాత్రం ఇప్పటికీ మారలేదు.