దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రాజెక్టు కే గ్లిమ్స్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ ఏంటన్నది ? ఇప్పటివరకు పెద్ద సస్పెన్స్ గా ఉండగా.. ఆ సస్పెన్స్ ఎట్టకేలకు రివిల్ అయింది. ప్రాజెక్టు కే సినిమాకు కల్కి 2898 ఏడి అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.. అప్పుడు అంతం ఆరంభం అవుతుంది అనే నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్టు తెలుస్తోంది. వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనే ఒక డైలాగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్లు ఉన్నాయి.
ఇక విజువల్స్ అయితే అందరిని కట్టి పడేసాయి. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శాన్ డియాగో కామిక్ ఖాన్ వేడుకల్లో మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్టు కే రికార్డులకు ఎక్కింది. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్ తో పాటు కమలహాసన్, దగ్గుపాటి రానా, నిర్మాత అశ్వినీదత్ తదితరులు పాల్గొని సందడి చేశారు.
మహానటి తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడన్న ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. పైగా అగ్ర నటులు అమితాబచ్చన్, కమలహాసన్ తో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, మరో హీరోయిన్ దిశా పటాని కీలక పాత్రలలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు.
అసలు గ్లింప్స్‌లో విజువల్స్ చూస్తుంటే మనం ఖచ్చితంగా మరో ప్రపంచంలోకి ఎంటర్ కాబోతున్నాం అని చెప్పకనే చెప్పేసింది. నాగ్ అశ్విన్ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మనలను మాయ చేయబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాను వచ్చే యేడాది మే 9న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.