టిడిపికి బాగా పట్టున్న లోక్సభ నియోజకవర్గాలలో గుంటూరు ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజిక ప్రాబల్యం ఎక్కువ. ఆ సామాజిక వర్గం ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు ముందు నుంచి టిడిపికి కొమ్ముకాస్తూ వస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా గుంటూరు నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక వైసిపి ఆవిర్భవించాక జరిగిన రెండు ఎన్నికలలోను గుంటూరు నుంచి టిడిపి తరఫున కమ్మ వర్గానికి చెందిన గల్లా జయదేవ్ విజయం సాధించారు.
గత ఎన్నికలలో రాష్ట్ర మొత్తం వైసిపి ప్రభంజనం వీచినా.. గుంటూరులో ఎంపీగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి జయదేవ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా వరుసగా రెండోసారి గెలిచిన జయదేవ్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అయితే ఈసారి జయదేవ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఆయన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం లేదా.. తన వ్యాపారంపై దృష్టి పెడుతూ రాజ్యసభకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడంతో వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు వ్యాపారంపై సరిగా దృష్టి సారించలేకపోతున్నాను అన్న భావన జయదేవ్లో ఉంది. ఇది ఇలా ఉంటే జయదేవ్ వచ్చే ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుంటే గుంటూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, మరో పారిశ్రామికవేత్త సుజనా చౌదరి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే టిడిపి నుంచి రెండుసార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు.
పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గత ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజన 2019లో టిడిపి ఓడిపోయాక బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయన పేరుకు మాత్రమే బిజెపిలో ఉన్నా టిడిపి నేతలతో సన్నిహిత సంబంధాలు.. పాత పరిచయాలు కొనసాగిస్తున్నారు. వచ్చే సారి ఆయనకు బిజెపి నుంచి రాజ్యసభ రెన్యువల్ అయ్యే ఛాన్సులు లేవు. ఈ క్రమంలోనే ఆయన కేంద్రంలో ఎంపీగా ఉంటే తన వ్యాపార వ్యవహారాలను చక్క పెట్టుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు.
అందుకే ఈసారి గుంటూరు నుంచి టిడిపి తరఫున లోక్సభ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందుగానే ఆయన మళ్ళీ టిడిపి తీర్థం పుచ్చుకోవచ్చని అంటున్నారు. లేదా టిడిపి బిజెపి పొత్తు కుదిరితే బిజెపి తరఫున గుంటూరు నుంచి బరిలో ఉంటారని చెబుతున్నారు. ఇటు గుంటూరు జిల్లా టిడిపి నేతలతోనూ సుజనా చౌదరికి మంచి సంబంధాలు ఉన్నాయి.
దీంతో గుంటూరు టిడిపి నేతలు పెద్దగా అభ్యంతరం చెప్పరని కూడా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం గుంటూరు వచ్చిన సుజనా టిడిపి నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా నివాసంలో జిల్లా టిడిపి నేతలతో భేటీ అయ్యారు. అటు చంద్రబాబుతో కూడా సుజనా టచ్లో ఉన్నట్టు టాక్ ?దీంతో ఆయన టిడిపి ఎంట్రీ పై జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.