టాలీవుడ్ దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. 1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీహరి విలన్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీహరి గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కూడా. ఎవరైనా సహాయం అని ఆయన వద్దకు ఎవరు వెళ్లినా దగ్గర్నుంచి లేదన్నమాట ఎప్పుడు వచ్చేది కాదట.
ఇలాంటి ఈ గొప్ప నటుడు ఐటెం డ్యాన్సర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జన్మించింది. వీరి కుమార్తె అక్షర పుట్టిన నాలుగు నెలలకే మరణించింది. ఇక దాంతో శ్రీహరి తన కూతురు అక్షర పేరుతో ఒక ఫౌండేషన్ స్థాపించి ఎందరికో ఆ ఫౌండేషన్ ద్వారా సహాయం అందించారు. ఇప్పటికీ ఆ ఫౌండేషన్ కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి ఈ గొప్ప నటుడు సినిమాల్లోకి రాకముందు ఎలాంటి పని చేసాడో తెలిస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజానికి శ్రీహరి గొప్ప ఆస్తులున్న కుటుంబం నుంచి ఏమీ రాలేదు. ఆయన కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వీరి కుటుంబం యలమర్రు గ్రామంలో రోడ్డు పక్కన ఓ చిన్నపాక వేసుకుని సైకిల్ షాపు, సోడాలు అమ్మి వారి కుటుంబం జీవించేది.
కొన్నాళ్లకు ఈ కుటుంబం అక్కడ ఉన్న వారి భూమిని అమ్ముకొని హైదరాబాదుకు వలస వచ్చింది. హైదరాబాదులో కూడా వీరి కుటుంబం ఎన్నో కష్టాలు పడుతూ పాలు అమ్ముతూ, మెకానిక్ షాపు నడుపుతూ వారి జీవనం సాగించేది. శ్రీహరి కూడా చదువుకుంటూనే అన్న శ్రీనివాసరావు నడుపుతున్న వెల్డింగ్ షాప్‌లో పని చేసేవాడట. ఖాళీ టైంలో షాపు ముందు ఉన్నశోభన థియేటర్లో సినిమాలు చూస్తూ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు.
మరి ముఖ్యంగా శ్రీహరికి బ్రూస్లీ సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే జిమ్నాస్టిక్ లో శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడు దశాబ్దాలు మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగాడు. దురదృష్టవశాత్తు శ్రీహరి 2013లో కాలేయ సంబంధిత వ్యాధితో మరణించాడు.