మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలో ఉన్నాయి. అయితే వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాల్లో చిరు నటించిన గ్యాంగ్ లీడర్ ముందు వరుసలో ఉంటుంది. విజయ బాపినీడు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ముందు చిరంజీవితో తీయాలని అనుకోలేదట. చిరు ఇమేజ్ను డబుల్ చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ముందు చిరంజీవి కోసం రాసుకున్న కథ కాదట చిరు తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు కోసం రాసుకున్నారట.
ఇక అప్పటికే చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో నాగ బాబు కూడా నటించి మెప్పించాడు. ఆ సినిమాలో మెగా బ్రదర్ నటన చూసిన పరుచూసి సోదరులు నాగబాబు హీరోగా కూడా మెప్పిస్తాడని అన్నారట. ఈ క్రమంలోనే నాగబాబును హీరోగా పెట్టి డైరక్టర్ విజయ బాపినీడుని ఒక కథను సిద్ధం చేయమని చెప్పడంతో గ్యాంగ్ లీడర్ కథ రెడి చేసారట. ఆ సినిమాకు “అరె ఓ సాంబ” అనే టైటిల్ కూడా అనుకున్నారట. అయితే కథ బాగా రావడంతో బడ్జెట్ కొద్దిగా ఎక్కువ అవుతుందని భావించి అన్నయ్య చిరంజీవికి ఈ కథ ఇచ్చేయండని చెప్పాడట నాగ బాబు.
చిరు అనేసరికి కొన్ని మాస్ డైలాగ్స్, కథలో కొన్ని మార్పులు చేశారట. అలా నాగబాబు హీరోగా రావాల్సిన గ్యాంగ్ లీడర్ సినిమా కాస్త చిరంజీవి హీరోగా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటిలో ఎన్నో రికార్డులను తిరగ రాసింది. మెగాస్టార్ చిరంజీవికి గ్యాంగ్ లీడర్ సినిమా అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అప్పటి యూత్ కు ఈ సినిమా చాలా బాగా ఎక్కేసింది. అంతేకాదు సినిమాలోని సాంగ్స్ కూడా అందరిని మెప్పించాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. గ్యాంగ్ లీడర్ తో పాటుగా చిరు చాలా సినిమాల వరకు అదే సక్సెస్ జోష్లో దూసుకుపోయారు.