తెలుగువారి వెలుగు లోగిళ్ల అన్నగారు నందమూరి తారక రామారావు. తెలుగు నాట ప్రభవించిన ఆత్మగౌరవ నినాదాన్ని దశదిశలా చాటిన తెలుగు వెలుగు పుట్టి.. వందేళ్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ కీర్తి.. మరో వందేళ్ల దాకా ఉంటుందనడంలో ఎలాంటి సందేహ మూ లేదు. తెలుగు వారి అన్నగారిగా చిర, స్థిర కీర్తులను సముపార్జించుకున్న ఎన్టీఆర్ గురించి.. అందరికీ తెలిసిందే.
అయితే.. భారత జాతిపిత మహాత్మాగాంధీ గురించి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఒక మాట అంటారు. ఓ 100 ఏళ్ల తర్వాత ఈ భూమిపై అలాంటి వ్యక్తి నడయారంటే.. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న ఒక సామాన్యుడు అసామాన్యుడిగా దేశాన్ని ముందుకు నడిపించారంటే.. అప్పటి తరాలు నమ్మగలవా!! అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు ఐన్ స్టీన్. అచ్చం అదేవిధంగా అన్న ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మరో వందేళ్ల తర్వాత కూడా ఆయన కీర్తి అజరామరమని చెబుతున్నారు.
తన అసమాన వ్యక్తిత్వంతో.. తెలుగు జాతి కోసం.. తెలుగు నేల కోసం పరితపించిన నందమూరి తారకరామారావు వంటి మూర్తీభవించిన మహామనీషి.. ఈ నేలపై నడయాడారంటే.. మున్ముందు తరాలు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎన్టీఆర్ ఇప్పుడు మన ముందు భౌతికంగా లేకపోయినా.. ఇప్పటికీ.. ఆయన పలుకులు మన చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఆశయాలు మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా.. ఒక వ్యక్తి గురించి.. కొన్ని తరాల తర్వాత మాట్లాడుకోవడం అంటే.. అంత తేలికైన విషయం కాదు.
ఆ మనిషిలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి. మరెన్నో వైవిధ్యాలు.. అంతకు మించిన త్యాగాలు ఉండి తీరాలి. అవన్నీ అన్న ఎన్టీఆర్లో ఉండి ఉండకపోతే… కేవలం.. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా ఆయన నిలిచిపోయి ఉంటే.. ఆ పరిస్థితి వేరేగా ఉండేది. ఇక, ఆయన పుట్టిన వూరు, పెరిగిన తీరు అందరికీ తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ గురించి పెద్దగా అందరికీ తెలియని విషయం.. తెలిసినా.. కొందరు చెప్పని విషయం ఏంటంటే.. ఆయన విజయవాడలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో చదివి.. 1947లో పట్టభద్రుడయ్యారు.
తర్వాత ఆయన మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాశారు. రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయనను మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారుగా నియమించారు. అన్న జీవితం వడ్డించిన విస్తరి కాదనేది తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం. 20 ఏళ్ల ప్రాయంలో ఆయన అనేక కష్టాలు పడ్డారు. కొద్దో గొప్పో తండ్రి ఆస్తులు ఉన్నా.. అవన్నీ.. ఎన్టీఆర్ వయసుకు వచ్చేసరికి హరించుకుపోయాయి. అయినా.. అన్నగారు ఎక్కడా కుంగిపోలేదు. కొన్ని రోజులు పాల వ్యాపారం చేశారు, తరువాత కిరాణా కొట్టు నడిపారు.
డిగ్రీ పూర్తి అయిన తర్వాత.. అన్నగారి ధ్యాసంగా సినిమాలపై మళ్లింది. దీంతో ఆయన మద్రాస్ వెళ్లిపోయి.. సినిమాల్లో ప్రయత్నం చేశారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా తొలి పరిచయం జరిగిన తర్వాత.. అన్నగారుఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. కథానాయకుడిగా అడుగు పెట్టినా.. ఆయన అక్కడితో ఆగిపోలేదు. 24 నాలుగు కళల్లోనూ ఆయన పట్టు సాధించారు. తర్వాత కాలంలో దర్శకుడిగా.. కథకుడిగా.. రచయితగా అనేక రూపాల్లో తన విశ్వరూపాన్ని చూపించారు.
సినీ రంగంలో అవకాశాలు తగ్గి రాజకీయాలు చేసిన వారు ఉన్నారు. కానీ, అన్నగారు అలా చేయలేదు. సినిమా రంగంలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్న సమయంలోనే ఆయన రాజకీయ ప్రవేశం చేశారనే విషయం చాలా మందికి తెలియదు. అంత బిజీగా ఉన్నప్పటికీ.. అన్నగారు .. రాజకీయాల్లోకి రావడానికి ప్రధానకారణం.. సమాజం పట్ల.. ముఖ్యంగా తెలుగు ప్రజల పట్ల ఉన్న ప్రేమాభిమానాలేనన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ కీర్తి మరో వందేళ్ల వరకు స్థిర స్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.