బ్ర‌హ్మానందంకు రెండేళ్ల జీతం ముందే ఇచ్చారా… ఆ `ల‌క్ష‌న్న‌ర న‌మ్మ‌కం` స్టోరీ ఇదే..!

హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం తెర‌మీద క‌నిపిస్తేనే చాలు.. న‌వ్వులు ఆగ‌వు. ఆయ‌న న‌టనే కాదు.. మాట‌లు.. అభిన‌యం కూడా కిత‌కిత‌లు పెడ‌తాయి. ఇలాంటి వారు చాలా అరుదుగా మాత్ర‌మే సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపిస్తారు. బ్ర‌హ్మానందాన్ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసింది దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జంధ్యాల‌. అప్ప‌టి వ‌ర‌కు తెలుగు, ఇంగ్లిష్ లెక్చ‌ర‌ర్‌గా ఉన్న బ్ర‌హ్మానందాన్ని అహ‌నా పెళ్లంట సినిమాతో తెర‌మీదికి తెచ్చారు.

ఈ సినిమా 1987లో వ‌చ్చింది. అప్ప‌టికి బ్ర‌హ్మానందానికి కాలేజీలో నెల‌కు 6000 జీతం వ‌చ్చేది(ప్ర‌స్తుత లెక్క‌ల్లో అయితే 60 వేల‌కు పైగానే). దీనిని వ‌దులు కోవ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేదు. కుటుంబానికి బాధ్య‌త‌లు ఉన్నాయి. పైగా సినిమా రంగంపై కొంద‌రికి వ్య‌తిరేక‌త కూడా ఉంది. కానీ, జంధ్యాల మాత్రం ప‌ట్టుబ‌ట్టారు. మీరు న‌టించాల్సిందే.. అని చెప్పారు. అప్ప‌టికి జంధ్యాల గురించి విన‌డ‌మే త‌ప్ప‌.. బ్ర‌హ్మానందానికి పెద్ద‌గా తెలియ‌దు.

అయినా.. కాద‌న్నారు. కానీ, జంధ్యాల ఏం చేశారంటే..“చూడండి.. ముందు న‌న్నున‌మ్మండి. సినిమాలో హిట్ అవుతారో లేదో అనేకదా మీ డౌట్‌. స‌రే.. ఓ ప‌నిచేద్దాం.. రెండేళ్ల‌కు స‌రిపోయేంత జీతం ఇప్పుడే ఇస్తాను. మీ రెమ్యున‌రేష‌న్ నిర్మాత ఇస్తారు. ఇది నేను స్వ‌యంగా ఇస్తున్న `న‌మ్మ‌కం“`. అంటూ.. అప్ప‌టి క‌ప్పుడు.. ల‌క్ష‌న్న‌ర సొమ్ముకు చెక్ ఇచ్చేశారు. దీంతో బ్ర‌హ్మానందం కాద‌న‌లేక పోయారు.

ఇక‌, సినిమా సూప‌ర్ హిట్‌. వెనుదిరిగి చూసుకునే ప‌నిలేకుండా పోయింది. అంతేకాదు.. జంధ్యాల సినిమాల‌న్నింటిలోనూ దాదాపు బ్ర‌హ్మానందం న‌టించారు. అంతేకాదు.. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న‌కు కాల్షీట్లు ఇవ్వ‌లేనంత బిజీ అయిపోవ‌డం గ‌మ‌నార్హం. కొస‌మెరుపు ఏంటంటే.. ఆ చెక్ ఇప్ప‌టికీ బ్ర‌హ్మానందం ద‌గ్గ ర ఉంది. అదికూడా ఫ్రేమ్ క‌ట్టించుకుని పెట్టుకున్నార‌ట‌.