టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విడిపోయిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా పెట్టి పాలన చేశారు. అయితే గత ఎన్నికల్లో అమరావతి ప్రాంత పరిధిలో టిడిపి సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అక్కడి ప్రజలు వైసీపీకి మద్ధతు పలికారు. అమరావతి పరిధిలో తాడికొండ, మంగళగిరి స్థానాల్లో టిడిపి ఓడిపోయింది. చుట్టూ ఉన్న పెదకూరపాడు, పొన్నూరు, సత్తెనపల్లి, తెనాలి, వేమూరు, ప్రత్తిపాడు లాంటి స్థానాల్లోనూ టిడిపి ఓడిపోయింది.
కేవలం గుంటూరు వెస్ట్, రేపల్లె సీట్లు మాత్రమే గెలిచింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి ప్రాంత ప్రజలకు జ్ఞానోదయం అయింది. వైసీపీకి వ్యతిరేకంగా మారారు. టిడిపికి అనుకూలమైన వాతావరణం వచ్చింది. కానీ అంతా బాగానే ఉన్న కొన్ని చోట్ల టిడిపిలో నాయకత్వ సమస్యలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు తాజాగా పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ స్థానాల్లో పర్యటిస్తున్నారు.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మూడు చోట్ల రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అయితే సత్తెనపల్లి సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. ఈ సీటు ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు. ఇక పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు..ఓడిపోయిన దగ్గర నుంచి పార్టీని బలోపేతం చేస్తూ శ్రీధర్ కష్టపడుతున్నారు. అధికార వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్న నిలబడి..పార్టీ కోసం పనిచేస్తున్నారు.
ఇక ఈ సీటు విషయం బాబు తేల్చేయొచ్చు.. శ్రీధర్‌ని ఈ రోజే మళ్లీ ఆయన్నే అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభ్యర్ధిగా ఫిక్స్ చేస్తే శ్రీధర్ మరింత దూకుడుగా ముందుకెళ్తారు..పెదకూరపాడులో మళ్ళీ టిడిపి జెండా ఎగరవేసే ఛాన్స్ ఉంది. ఇటు తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ ఉన్నారు.. మరి ఆయనకు సీటు ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.
ఇక సత్తెనపల్లి విషయంలో ఆశావాహులు చాలా మందే ఉన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కూడా పార్టీలోకి రావడంతో ఆయనకు కూడా ఈ సీటు ఇవ్వవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే సత్తెనపల్లి సీటు విషయంలో బాబు ఈ సారి తేల్చే ఛాన్సులు లేవు. మొత్తానికి అమరావతిలో బాబు టూర్ తో టిడిపికి కొత్త ఊపు రానుంది.