ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వం. దీని ద్వారా ప్రజలకు చేరువ కావాలనేది.. వైసీపీ అధినేత జగన్ లక్ష్యం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన రివ్యూలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను అదిలిస్తున్నారు. కదిలిస్తున్నారు. అంతేకాదు.. హెచ్చరిస్తున్నారు కూడా. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా.. ఎన్నికలకు రెండేళ్ల ముందే ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికీ తిరుగుతున్నారు.
అయితే.. కొందరు తిరుగుతున్నారని.. మరికొందరు తిరగడం లేదని.. సీఎం జగన్ హెచ్చరిస్తున్నారు. వారికి టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. సరే.. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ.. అసలు గడప గడప కార్యక్రమాన్ని పరిశీలిస్తే.. ఇది మంచి ప్రయత్నమనే అభిప్రాయం.. ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తోంది. అందుకే.. ప్రతిపక్షాలు కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు ఇదే తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
అయితే.. వైసీపీ అధినేత ఆదేశాల మేరకు రంగంలోకి దిగినప్పటికీ.. ఎమ్మెల్యేలు కానీ.. మంత్రులు కానీ.. చాలా మంది మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. అసలు ఉద్దేశం.. ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను తగ్గించడం. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దానిని తగ్గించుకుని గ్రాఫ్ పెంచుకోవాలన్నది సీఎం సూచన.
అయితే..ఈ ప్రణాళికను తూ.చ తప్పకుండా అమలు చేయడంలో మంత్రులు, నాయకులు విఫలమవు తున్నారు. ప్రజలతో గడుసుగా మాట్లాడడం.. చీదరించుకోవడం.. ఛీత్కరించుకోవడం.. వారు కోరిన పనుల విషయాన్ని పట్టించుకోకపోవడం వంటివి కార్యక్రమం ఉద్దేశాన్ని పూర్తిగా నీరుగారుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలన్న సంకల్పం వీరి ప్రవర్తనతో పూర్తిగా మసక బారుతోందన్నది వైసీపీ కీలక నేతల టాక్. నిజానికి ఓర్పు, నేర్పుతో ప్రజలను కలిసి పలకరించాల్సిన నాయకులు గాడి తప్పుతుండడంతో ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం కన్నా.. మైనస్లే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.