ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం..ఒకప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేదు. ఎప్పుడో పార్టీ ఆవిర్భావంలో రెండుసార్లు గెలిచింది..1983, 1985 ఎన్నికల్లో గెలిచింది. ఇక ఆ తర్వాత ఇక్కడ టిడిపి వరుసగా ఓడిపోతూ వచ్చింది. 1989 నుంచి 2004 వరకు కాంగ్రెస్ తరుపున వరుసగా మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. అలా వరుసగా కాంగ్రెస్ జెండా ఎగురుతున్న సమయంలో టిడిపికి కొమ్మాలపాటి శ్రీధర్ కొత్త ఊపు తీసుకొచ్చారు.
మళ్ళీ 1985 తర్వాత 2009లో పెదకూరపాడులో టిడిపి జెండా ఎగరవేశారు. అదే ఊపులో 2014లో కూడా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ గాలిలో శ్రీధర్ ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి నంబూరు శంకర్ రావు విజయం సాధించారు. అయితే అధికార బలంతో వైసీపీ హవా కొనసాగిస్తూ వచ్చారు. అయినా సరే శ్రీధర్ వైసీపీకి ధీటుగా పొరాడి..టిడిపిని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎదురోడ్డి నిలబడ్డారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచారు.
వైసీపీతో ఢీ అంటే ఢీ అనే విధంగా శ్రీధర్ రాజకీయం నడిపించారు. గత యేడాదిన్నర కాలంగా అసలు ఎమ్మెల్యే శంకర్రావు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు కాని.. మాజీ ఎమ్మెల్యే శ్రీథర్ ప్రతి రోజు ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. గత ఆరేడు నెలలుగా శ్రీధర్ అంచనాలకు మించి పుంజుకుని రేసులోకి వచ్చారు. తాజాగా పెదకూరపాడులో చంద్రబాబు పర్యటన జరిగిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు భారీ స్థాయిలో జనం వచ్చారు. సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
అంటే పెదకూరపాడులో ప్రజలు శ్రీధర్ వైపు ఏ విధంగా తిరిగారో అర్ధం చేసుకోవచ్చు. పైగా అక్కడ వైసీపీ ఎమ్మెల్యే శంకర్ రావుపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అక్రమంగా ఇసుక దోచేస్తున్నారని, పలు అక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పెదకూరపాడులో శ్రీధర్ హయాంలోనే అభివృద్ధి అయింది..దీంతో ప్రజలు మళ్ళీ శ్రీధర్‌నే కోరుకుంటున్నారు.
దీనికి తోడు శ్రీథర్ టైంలో రాజకీయపరంగా కేసులు లేవు. ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు ఎక్కువైపోతున్నాయన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇక రాజధాని వికేంద్రీకరణ ప్రభావం మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల తర్వాత పెదకూరపాడులోనే ఎక్కువుగా ఉంది. ఇవన్నీ ఈ సారి ఇక్కడ శ్రీథర్‌కు చాలా ప్లస్ అవుతున్నాయి. మొత్తానికైతే ఈ సారి పెదకూరపాడులో వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది.