కృష్ణాజిల్లా గన్నవరం రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గా ఉంటాయి. గత రెండు ఎన్నికలలో ఇక్కడ టిడిపి నుంచి వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించి తన పట్టు నిరూపించుకున్నారు. గత ఎన్నికలలో వైసిపి ప్రభంజనంలోనూ 800 ఓట్ల స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఎన్నికల తర్వాత టిడిపికి దూరమై.. వైసీపీకి దగ్గరయ్యారు. ఇక వచ్చే ఎన్నికలలో వైసీపీ టికెట్ తనదే అని చెప్పుకుంటున్న వంశీ ఆ పార్టీ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటున్నారు.
వంశీపై గత రెండు ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన దుట్టా రామచంద్రరావు – యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరు కూడా వంశీకి టిక్కెట్ ఇస్తే ఊరుకోమని ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు. వంశీ ఎంట్రీ తో గన్నవరం వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది.. వైసిపి మూడు ముక్కలుగా చీలిపోయింది. వంశీ వైసిపిలోకి వెళ్లిపోవడంతో టిడిపి నుంచి ఎవరు ? పోటీ చేస్తారు అన్నది సస్పెన్స్ గా కొనసాగుతోంది.
నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గన్నవరం ఇన్చార్జిగా ఉన్నారు. ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో మరోసారి టిడిపి నుంచి పోటీ చేసేందుకు దాసరి సోదరులు సిద్ధమవుతున్నారు. విజయ సంస్థల అధినేత అయిన దాసరి సోదరులు గన్నవరం నియోజకవర్గానికి చెందినవారు. గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం ఆముదాలపళ్లి వారి స్వగ్రామం.
దాసరి బాలవర్ధన్ రావు 1999 – 2009 ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత గన్నవరం సీటు టిడిపి వంశీకి ఇవ్వడంతో వారు రాజకీయంగా దూరమయ్యారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లారు.. ఇప్పుడు వంశీ వైసీపీలోకి వెళ్లిపోవడంతో దాసరి సోదరులు తిరిగి టిడిపిలోకి వచ్చేందుకు.. టిడిపి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
దాసరి సోదరులు టిడిపి నుంచి పోటీ చేస్తే గన్నవరం రాజకీయం మంచి రసకందాయంలో పడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో వంశీని ఓడించేందుకు ఇటు టీడీపీలో ప్రత్యర్థులు, అటు వైసీపీలో వంశీ శత్రువులు ఏకం అయ్యే పరిస్థితులే స్థానికంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా వంశీకి ఈ సారి గెలుపు కష్టంగానే కనిపిస్తోంది.