సూర్య ఈ పేరు చెబితే తెలియని తెలుగు సినిమా జనాలు ఉండరు. సూర్య స్వతహాగా తమిళ హీరో అయినా తెలుగులో కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. సూర్యకు ఇప్పుడు ఉన్న క్రేజ్ అంత ఈజీగా రాలేదు. తండ్రి హీరో అయినా సూర్య ఎప్పుడు షూటింగ్ చూసేందుకు కూడా వెళ్లలేదు. నటనపై ఆసక్తి కూడా చూపలేదు. అయితే పరిస్థితుల ప్రభావంతో సూర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక తప్పలేదు.
ప్రారంభంలో నటుడుగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. సూర్య అసలు పేరు శరవణన్. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆ పేరును సూర్యగా మార్చారు. సూర్య తండ్రి శివకుమార్ అప్పట్లో హీరో అయినా సినిమాల్లోకి వచ్చేందుకు సూర్య అంతగా ఆసక్తి చూపేవారు కాదు.
ఇక ఆర్థిక సమస్యల వల్ల సూర్య ముందుగా ఓ గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత సొంతంగా కంపెనీ పెట్టి వ్యాపారం బాగున్నా ఆ రంగంపై ఆసక్తి చూపలేకపోయారు. సీనియర్ నటుడు రఘువరన్ సలహా మేరకు సూర్య సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. పువెల్లార్ కేటుప్పన్ సినిమా షూటింగ్ టైంలో జ్యోతిక సూర్యతో మీ కళ్ళు చాలా బాగుంటాయి అని ప్రశంసించింది అట.
ఓ అమ్మాయి నుంచి తాను అందుకున్న తొలి కాంప్లిమెంట్ అదే అని సూర్య పలు సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువా సినిమాతో వచ్చే యేడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.