అది అన్నగారు ఎన్టీఆర్, అక్కి నేని నాగేశ్వరరావులు దూసుకుపోతున్న కాలం. పైగా వీరిద్దరి సరసన సావిత్రి నటిస్తున్న జోరు. వీరి సినిమాలకు ఎనలేని ప్రజాదరణ. అంతేకాదు.. సావిత్రి పక్కన ఉంటే.. ఎన్టీఆర్ అయినా. ఉండాలి, అక్కినేని అయినా.. ఉండాలనే సెంటిమెంటు. వీరిని తప్పించి ఎవరుఆమె పక్కన నటించినా.. ఆమె ఎవరిపక్కన నటించినా ప్రేక్షకులు ఆదరించరని నిర్ణయం. కానీ, అనూహ్యంగా ఓ నిర్మాత, దర్శకుడు చేసుకు్న్న నిర్ణయం ప్రకారం.. రక్తసంబంధం అనే సినిమాకు రూపం వచ్చింది.
దీనిలోనూ అన్నగారు, సావిత్రి నటించారు. కానీ, హీరో, హీరోయిన్లుగా మాత్రం కాదు. ఇద్దరూ అన్నాచెల్లెళ్లు. అంతే.. ఈ విషయం తెలిసిన బయ్యర్లు.. కొనేది లేదని తేల్చి చెప్పారు. అయితే.. కథ పూర్తయ్యాక చెబుతాం.. అంటూ.. నిర్మాత వారిని సర్దిచెప్పారు. ఇక, సావిత్రి పక్కన భర్తగా ఎవరు నటించాలని చూశారు. ఒకరిద్దరు నటులను అడిగారు. కానీ, మహానటి పక్కన నటించేస్థాయి తమకు లేదని వారంతా తప్పుకొన్నారు. చివరకు కాంతారావును అన్నగారు సిఫార్సు చేశారు. అన్నగారు చెబితే కాదనేది ఏముంది.. అంటూ.. కాంతారావు ఒప్పుకున్నారు.
సినిమా పూర్తయింది. కథ అందరికీ తెలిసిందే. అన్నాచెల్లెళ్ల అనురాగంతో నడిచే కథలో అన్నగారు.. సావిత్రి జీవించారు. నిడివి తక్కువే ఉన్నా.. కాంతారావు పాత్రకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఎక్కడో డౌటు మాత్రం నిర్మాత, దర్శకుడిని వెంటాడింది. రషెస్ చూసుకున్నారు. బాగానేఉంది. కానీ.. ప్రేక్షకులు మెచ్చాలిగా అంటూ.. సందేహంతోనే సినిమాను వదిలి పెట్టారు. బయ్యర్లు సగం సొమ్మును మాత్రమే అడ్వాన్సుగా ఇచ్చారు. మిగిలింది తర్వాత చూస్తామన్నారు.
వారం గడిచింది. అంతంతమాత్రంగానే కలెక్షన్లు ఉన్నాయి. అయితే.. పాటలు హిట్ కావడంతో తర్వాత పుంజుకుంది. అంతే.. అనూహ్యంగా ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ విషయాన్ని చాలా రోజులు చెప్పుకొన్నారు. కథలో దమ్ముంది కాబట్టి ఆడిందని కొందరు.. అంటే., కాదు.. అన్నగారు సాహసం చేశారు కాబట్టి ఆడిందని కొందరు చెప్పారు. తర్వాత.. ఇంత సాహసం ఎవరూ చేయలేదు.