ప్రస్తుతం భారతదేశంలో చాలామంది ప్రజలు షుగర్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు లేని ఈ షుగర్ వ్యాధి వారు తీసుకునే ఆహారం, మారుతున్న జీవన పద్ధతులు, అలవాట్ల ద్వారా జనంలో అధికంగా పెరిగిపోయింది. శరవేగంగా పెరుగుతోన్న ఈ షుగర్ వ్యాధి గురించి.. తాజాగా ఐసిఎంఆర్ విడుదల చేసిన ఇండియన్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్ లో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దేశం మొత్తంలో 11.4% మంది అంటే 10 కోట్లకు పైగా ప్రజలు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.
అలాగే 35.5% మందిలో బీపీ ఉన్నట్లు తేలింది. దేశంలో 31 రాష్ట్రాలలో అసంక్రమిక వ్యాధుల భారీన పడినవారి సంఖ్య అంచనా వేయడానికి చేసిన ఒక సర్వేలో బిపీ, ఒబిసిటీ లాంటి సమస్యలు తీవ్రతను గుర్తించింది. దాదాపు లక్షల మంది ప్రజల నమూనాల నుంచి ఈ సర్వే రూపొందించారు. షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా, పుదుచ్చేరి, కేరళ. చంఢీఘర్, ఢిల్లీ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణ 17వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 9.9 శాతం మంది… ఆంధ్రప్రదేశ్లో 9.5 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. ఈ రెండు రాష్ట్రాల కంటే కేరళ, తమిళనాడు, కర్ణాటకలో షుగర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో షుగర్‌తోనే కాక 10% నుంచి 14.9% శాతం మంది ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లో ఉన్నారట.
30% మందికి పైగా బిపీ.. 20 నుంచి 30 % లోపు ప్రజలు ఒబిసిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లు తెలిసింది. మన తెలుగు రాష్ట్రాలో బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ, ట్రైగ్లిజరాయిడ్లో రెడ్ జోన్ లో ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఈ వ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉందట. ఈ షుగర్ వ్యాధి పట్టణ ప్రాంతాల్లో 16.4% ఉండగా గ్రామాల్లో 8.9% ఉన్నట్లు తేలింది.