ఏదైనా సాయంత్రం వేళ యువతీ యువకులు, కుటుంబాల్లోని వారు.. ఒకింత సేద దీరేందుకు సమీపంలోని బీచ్‌కు వెళ్లడం తెలిసిందే. ఇది అందరికీ సాధ్యం కాదు. సముద్ర తీరం ఉన్న విశాఖ, నెల్లూరు, మచిలీపట్నం వంటి కొన్నిప్రాంతాల వారికే మన రాష్ట్రంలో సాధ్యం. అయితే.. ఇప్పుడు ఇలా బీచ్‌లోకి వెళ్లాలంటే కూడా.. వైసీపీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. గాజాగా బీచ్‌లో ప్రవేశానికి వైసీపీ టికెట్ పెట్టింది.. దీంతో “బీచ్ పక్కకెళ్లొద్దురో.. డింగరీ!“ అనే పాటలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగింది?
విశాఖలోని ప్రఖ్యాత ప్రాంతంగా గుర్తింపు పొందింది రుషికొండ బీచ్. తొలిసారి విశాఖకు వెళ్లేవారు .. ఖచ్చితంగా ఈ బీచ్ చూసి రావాలని అనుకుంటారు. ఇక, విశాఖ వాసులు సెలవు దినాలు, ఆదివారాలు.. పండగల వేళ సాయంత్రాలు ఎక్కువగా ఈ బీచ్‌లోనే గడిపేస్తారు. అయితే.. ఇప్పుడు వైసీపీ సర్కారు ఈ బీచ్‌కు ఎంట్రీ టిక్కెట్లు పెట్టింది. పెద్దలకు రూ.20గా నిర్ణయించింది. అది కూడా 15 ఏళ్లు దాటిన వారంతా పెద్దలుగా అధికారులు నిర్ణయించేయడం గమనార్హం.
ఇక, సర్కారు నిర్ణయంపై టీడీపీ సహా ప్రజాసంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సర్కారు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైజాగ్‌లో తాకట్టు పెట్టాలకున్నవన్నీ పెట్టేశారు. అమ్మలనుకున్నవన్నీ అమ్మేశారు. కూల్చాలనుకున్నవన్నీ కూల్చేశారు. వెయ్యాలనుకున్న పన్నులన్నీ వేసేశారు. ఇప్పుడేమో బీచ్‌ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు పెడతారా?“ అని నిప్పులు చెరిగారు.
అంతేకాదు.. వైజాగ్ అంటే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయని, సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతోందని విశాఖ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారని గంటా తెలిపారు. మరోవైపు.. ‘బ్లూ’ ఫాగ్ గా గుర్తింపు ఉన్న రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే 20 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికుల నుంచి కూడా తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్‌ల వద్ద పార్కింగ్ రుసుం కింద ద్విచక్ర వాహనాలకు రూ. 10, కార్లకు రూ.30, బస్సులకు రూ.50 వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బీచ్‌లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజ్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.