మహానటి భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెకు దర్శకత్వం నుంచి నటన వరకే కాకుండా.. పాటలు, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. ఆమెపాటలు ఆమేపాడుకునేవారు. అయితే.. భరణి పిక్ఛర్స్ పతకాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. ఆ బ్యానర్‌పై చక్రపాణి చిత్రాన్ని నిర్మించారు. దీనిలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఒక రోజు మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఘంటసాల పాట పాడుకుంటూ ప్రాక్టీసు చేస్తున్నారు.
భానుమతి ఊరుకోకుండా ఘంటసాల గారూ.. ఇది భరణి ఆఫీస్. మీరు విజయా వారికి పాడినట్లు పాడితే ఇక్కడ కుదరదు. విజయా సంస్థ కంటే మా సంస్థ గొప్పది. వరస మార్చండి. గొంతు మార్చి పాడండి.. అన్నారు. నిజానికి అప్పటికే ఘంటసాలకు పద్మశ్రీ అవార్డుతో పాటు చెన్నైలో గజారోహణం కూడా జరిగింది. అలాంటి అగ్ర గాయకుడిని భానుమతి ఇలా అనేసరికి ఆయన మనసు చివుక్కుమంది.
అంతే.. ఘంటసాలకు కోపం వచ్చి, అయితే మీకు నచ్చే విధంగా వేరే వాళ్ళతో పాడించుకోండి.. అనేసి కోపంగా వెళ్ళిపోయారు. అప్పుడు భానుమతి కనీసం ఆయనతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయకుండా.. అప్పుడే వర్ధమాన గాయకుడిగా ఉన్న ఏ.ఎం.రాజాతో చక్రపాణి చిత్రంలో అక్కినేనికి పాటలు పాడించారు.
ఈ విషయం సినిమా విడుదలయ్యే వరకు చాలా గోప్యంగా ఉంచారు. చిత్రం విడుదలైంది. అప్పటి వరకు నాగేశ్వరరావు గొంతుకు ఘంటసాల పాటలతో అలవాటు పడిన ప్రేక్షకులు.. ఒక్కసారిగా గాయకుడు మారే సరికి విమర్శలు చేశారు. దీనిపై సినీ రంగంలోనూ ప్రత్యేకంగా చర్చ వచ్చింది. కొందరు షూటింగులు కూడా ఆపేశారు.
అయితే.. ఇదంతా ఘంటసాలే చేయిస్తున్నారని.. భానుమతి ఎదురు దాడి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న భానుమతి భర్త, దర్శకుడు రామకృష్ణ.. ఇద్దరికీ నచ్చజెప్పి.. వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు. కానీ, తర్వాత కాలంలో భానుమతి సినిమాల్లో ఎవరు నటించినా.. ఘంటసాల మాత్రం పాడకపోవడం గమనార్హం.