‘ ప్రాజెక్ట్ K ‘ లో క‌మ‌ల్ ప్లేస్‌లో ముందుగా అనుకున్న స్టార్ హీరో ఎవ‌రంటే…!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాలలో ప్రాజెక్ట్ K కూడా ఒకటి. మహానటి లాంటి గొప్ప దృశ్య కావ్యం తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హాలీవుడ్ రేంజ్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

అమితాబచ్చన్, దీపిక పదుకొనే లాంటి అగ్రనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా లోక నాయకుడు కమలహాసన్ కూడా ఈ ప్రాజెక్ట్‌ కేలో భాగమయ్యారు. ఈ సినిమాలో విలన్ గా కమల్ కనిపించబోతున్నాడు. కమల్ పాత్ర సినిమా మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆగస్టులో కమలహాసన్ డేట్లు కేటాయించారని కూడా అంటున్నారు.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదివరకు ఎప్పుడూ రానటువంటి కొత్త కథాంశంతో ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్‌ని తీసుకోవాలని నాగ్ అశ్విన్ భావించారట.

అయితే ప్రభాస్ గతంలో బుజ్జిగాడు సినిమాలో రజనీకాంత్ కు వీరాభిమానిగా నటించారు. ఇప్పుడు సూపర్ స్టార్ విలన్ గా చేస్తే ప్రేక్షకులు కనెక్ట్ కారని ప్రభాస్ భావించారట. దీంతో నాగ్ అశ్విన్ సెకండ్ ఛాయిస్ గా కమల్ హాసన్ అనుకున్నారంట. ఇక చెన్నై వెళ్లి కమల్ హాసన్ ను ప్రత్యేకంగా కలిసి నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K సినిమా కథని నేరేట్ చేయడం జరిగింది. కమల్ హాసన్ కి కూడా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.