ఇద్దరూ హేమా హేమీలే. అయితే..ఒకరు హీరో.. ఒకరు అలనాటి హీరోయిన్. పైగా ఇద్దరూ దర్శకత్వంపై ప్రతిభ ఉన్న వారే. ఆ ఇద్దరే హీరో కృష్ణ, మరొకరు ఫైర్‌బ్రాండ్ భానుమతి. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలు చాలా చాలా తక్కువ. అయితే.. చిత్రం ఏంటంటే ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. “నాకు భానుమతి గారి యాక్షన్ అంటే ఇష్టం“ అని కృష్ణ, తనకు కృష్ణలో ఉండే అభినయం అంటే ఇష్టమని భానుమతి చెప్పుకొనేవారు.
ఇలాంటివారి మధ్య ఓ నిర్మాత చిచ్చు పెట్టారు. దీంతో పెద్ద రగడే తెరమీదికి వచ్చింది.
హీరో కృష్ణ స్వయంగా నిర్మించిన పండంటి కాపురం చిత్రం సూపర్ హిట్. దీనిలో ఆయన పట్టుబట్టి భానుమతిని `రాణీ మాలినీదేవి` పాత్రకు ఎంపిక చేశారు. కొన్ని రోజులు కథా చర్చల్లోనూ భానుమతి పాల్గొన్నారు.
అయితే ఆవిడతో కృష్ణ సినిమా తీస్తున్నారనే విషయం తెలియగానే నిర్మాత ఎస్.భావనారాయణ వచ్చి ‘భానుమతి అంటే ఎవరనుకున్నావు? ఆటంబాంబు. ఆవిడతో షూటింగ్ అంటే మాటలుకాదు. విజయావారి వల్లే కాలేదు. ఆమెను భరించలేక ‘మిస్సమ్మ’ నుంచి తీసేశారు. నువ్వు ఆమెతో సినిమా తీస్తే ఇబ్బంది పడతావు’ అని హెచ్చరించారు. దీంతో కృష్ణ ఒకింత ఆలోచించి.. విజయనిర్మల సలహా మేరకు భానుమతిని తప్పించారు.
భానుమతికి బదులు జమునను ఎంపిక చేశారు. ‘పండంటి కాపురం’ చిత్రంలో రాణీ మాలినీదేవి పాత్ర జమున పోషిస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. అది చూడగానే భానుమతికి విపరీతమైన కోపం వచ్చింది. తనను ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తొలగించి, వేరే హీరోయిన్‌ను పెట్టుకోవడాన్ని ఆమె సహించలేకపోయారు.
ఆ కోపంలో ‘పండంటి కాపురం’ చిత్రానికి పోటీగా అదే కథతో తనూ ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకొన్నారు. ఇది పెద్ద రగడ అయింది. ఈ విషయం కాస్తా ఎస్వీ రంగారావుకు తెలిసి.. ఇద్దరినీ అనునయించారు. చివరకు భానుమతి వెనక్కి తగ్గి.. రగడకు ఫుల్ స్టాప్ పెట్టారు.