ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఎవరని అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీలీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల భామ. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. యూత్ లో శ్రీలీలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం ఆమె వద్దకు భారీ ప్రాజెక్టులను తీసుకువెళుతున్నారు. రవితేజతో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ అయింది.
ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ – బాలయ్య భగవంత్ కేసరి – మహేష్ బాబు గుంటూరు కారం – పంజా వైష్ణవ్ సినిమా – రామ్, బోయపాటి సినిమా ఇలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నిన్న శ్రీలీల తన 22వ పుట్టినరోజు జరుపుకుంది. 2001 జూన్ 14న అమెరికాలో పుట్టిన శ్రీలీల బెంగళూరులో పెరిగింది. శ్రీలీల తల్లి స్వర్ణలత తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. దీంతో ఆమె అమెరికా నుంచి బెంగళూరు వచ్చి అక్కడ స్థిరపడింది.
ప్రస్తుతం శ్రీలీల ఎంబిబిఎస్ చదువుతోంది. చిన్నప్పటినుంచి భరతనాట్యం నేర్చుకున్న శ్రీలీల ప్రొఫెషనల్ డ్యాన్సర్. ప్రముఖ కన్నడ సినిమాటోగ్రాఫర్ భువన గౌడ శ్రీలీల మీద ఫోటోషూట్ చేశారు. ఆమె లుక్స్ నచ్చి దర్శకుడు ఏపీ అర్జున్ 2019లో వచ్చిన కిస్ సినిమాతో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ఆమె ముందుగా కన్నడ సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది.
అయితే ఆమె హీరోయిన్ కాకముందు బాలనటిగా ఒక తెలుగు సినిమాలో నటించిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 2017లో అంజలి మెయిన్ లీడ్ లో వచ్చిన చిత్రాంగద సినిమాలో సింధుతులాని ఒక కీలక పాత్రలో నటించారు. ఆమె చిన్ననాటి పాత్రలో శ్రీలీల మొదటిసారిగా వెండితెరపై కనిపించారు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.