దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సీరిస్ సినిమాలతో ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ అంటే కేవలం తెలుగు హీరో కాదు.. పాన్ ఇండియా హీరో. ప్రభాస్ ఇమేజ్ చెప్పాలంటే బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని చెప్పాలి. రెబెల్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ అంటే ఇప్పుడు నేషనల్ హీరో..!
ప్రస్తుతం ప్రభాస్ నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి. ఈ నెల 16న ఆదిపురుష్ ఆ తర్వాత సెప్టెంబర్‌లో సలార్, సంక్రాంతికి ప్రాజెక్ట్ కే సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ పేరు నేషనల్ లెవల్లో ట్రెండింగ్‌గా మారింది. ఇక ప్రభాస్ తండ్రి ఎవరో కాదు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు. ఆయన తన గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై కృష్ణవేణి (1974) , బిల్లా (2009) వంటి సినిమాలను నిర్మించారు.
ఇక ప్రభాస్ పెదనాన్న రెబల్‌స్టార్ కృష్ణంరాజు. ఈ కుటుంబానికి ఎప్పటి నుంచో సినిమాలతో అనుబంధం ఉంది. ప్రభాస్‌కు కూడా చిన్నప్పటి నుంచి నటన వైపు రావాలన్న కోరిక ఉంది. అయితే ఆ కోరిక అతడి చదువుకు ఏ మాత్రం ఆటంకం లేకుండా కొనసాగింది. ప్రభాస్ ప్రాథమిక పాఠశాల విద్య అంతా తన సొంత జిల్లాలోని భీమవరం డీఎన్నార్ పాఠశాలలో జరిగింది.
ఆ తర్వాత నలంద కాలేజ్‌లో ఇంటర్ చదివాడు. ఆ పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్‌లోనే బీటెక్ పట్టభద్రుడు అయ్యాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే వైజాగ్‌లోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెళుకువలు పొందాడు. ఆ తర్వాత 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.