డేంజ‌ర్ జోన్లో టాలీవుడ్‌… ప్రేక్ష‌కులు రాక‌… థియేట‌ర్ల‌లో ఈగ‌లు తోలుకోవ‌డ‌మేనా.. !

ఎస్ టాలీవుడ్ నిజంగానే డేంజ‌ర్ జోన్‌లోనే ఉంది. ద‌మ్మున్న కంటెంట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు సినిమాలు వ‌స్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చూస్తారు. బాల‌య్య అఖండ సినిమా వ‌స్తే క‌రోనాతో ప్రపంచం అత‌లాకుత‌ల‌మ‌వుతున్నా.. ఎన్ని భ‌యాలు ఉన్నా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు పోటెత్తారు. పైగా అఖండ‌ను త‌క్కువ రేట్ల‌లో ఒక‌టికి రెండు మూడు సార్లు చూసి మ‌రి బ్లాక్‌బ‌స్ట‌ర్ చేశారు.

ఇక ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య సినిమాల త‌ర్వాత విరూపాక్ష‌ను మిన‌హాయిస్తే స‌రైన స్ట్రైట్ సినిమా వ‌చ్చి హిట్ కొట్ట‌లేదు. ఇక మే ఎండింగ్‌, జూన్ నెల‌లో అస‌లు టాలీవుడ్ నుంచి స‌రైన సినిమా రాలేదు. క‌నీసం వారం రోజులు కాదు క‌దా.. రెండు, మూడు రోజులు కూడా థియేట‌ర్ల‌లో సినిమాలు నిల‌వ‌డం లేదు.

అంత చెత్త కంటెంట్‌తో సినిమాలు వ‌దులుతున్నారు. దీంతో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు లేక ఈగ‌లు తోలుకోవాల్సిన ప‌రిస్థితి. ఈ శుక్రవారం.. విమానం, టక్కర్, అన్ స్టాపబుల్ సినిమాలు ఎప్పుడు వ‌చ్చాయో.. ఎప్పుడు తీసేశారో తెలియ‌దు. అంత‌కు ముందు వీకెండ్‌లో మేమ్ ఫేమస్ – మళ్లీ పెళ్లి సినిమాలు రావ‌డం దుకార‌ణం స‌ర్దేయ‌డం రెండు రోజుల‌కే జ‌రిగింది. మేమ్ ఫేమ‌స్ త‌క్కువ బిజినెస్‌తో వ‌చ్చి గ‌ట్టెక్కినా అది థియేట‌ర్ల‌లో వారం రోజులు నిల‌బ‌డే ద‌మ్మున్న సినిమా కాదు.

ఇక హిట్ టాక్ వ‌చ్చిన బిచ్చ‌గాడు 2, 2018 సినిమాలు ఓ వారం రోజులు ఊపాయి అంతే..! ఇందులో 2018 సినిమా ఓటీటీలోకి సైతం వచ్చేసింది. అస‌లు గ‌త నెల రోజులుగా ఒక్క హిట్ సినిమా కూడా థియేట‌ర్ల‌లో వారం రోజులు నిల‌బ‌డ‌డం లేదు. థియేట‌ర్ల‌లో మెయింటినెన్స్ ఖ‌ర్చులు కూడా రావ‌డం లేదు. ఇక ఈ నెల 16న ప్ర‌భాస్ ఆదిపురుష్ పాన్ ఇండియా లెవ‌ల్లో వ‌స్తోంది. ఈ సినిమా అయినా రెండు, మూడు వారాలు స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిల‌బ‌డితేనే థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌తాయి. ఏదేమైనా తాలు కంటెంట్‌తో సినిమాలు తీస్తే టాలీవుడ్‌లో మ‌రిన్ని థియేట‌ర్లు మూత‌ప‌డ‌డం ఖాయం.