టాలీవుడ్లో ఇపుడు ఎక్కడ విన్నా రెండే టాపిక్స్ నడుస్తున్నాయి. ఒకటి ఆదిపురుష్ సినిమా గురించి, రెండోది వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం గురించిన వార్తలు. మన టాపిక్ లావణ్య త్రిపాఠి గురించి కాబట్టి ఇక్కడ ఆమె గురించి మాట్లాడుకుందాం. కొన్నాళ్ళనుండి వీరిరువురి ప్రేమ కబుర్లు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున నడిచేవి. అయితే ఎట్టకేలకు ఆ ప్రేమ నిజమని రుజువయ్యింది. అవును, తాజాగా వీళ్లిద్దరి నిశ్చితార్థం అంగ రంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసినదే.
మెగా ఫ్యామిలీకి చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిస్టర్ సినిమా షూటింగ్ లో భాగంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డారు. తాజాగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో ప్రేమలో పడటానికి ప్రధానంగా అతను చూపించిన ప్రేమ, కేర్ కారణం కాగా లావణ్యలో మూడు లక్షణాలు నచ్చి వరుణ్ ఆమెతో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
ఆమె సింప్లిసిటీ, చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ గౌరవించే తీరు, చలాకీగా మాట్లాడే గుణం లావణ్యలో వరుణ్ కు తెగ నచ్చాయని సమాచారం. అయితే వీరిద్దరిలో మొదటగా వరుణ్ ప్రపోజ్ చేయగా తరువాత లావణ్య ఓకే చెప్పారని సమాచారం. ఇకపోతే వరుణ్ లావణ్య పెళ్లి తేదీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. లావణ్య వరుణ్ ఇన్నేళ్లు సైలెంట్ గా ప్రేమించుకుని ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారనే చెప్పుకోవాలి.
ఇకపోతే, టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల రాక్షసిగా పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తన నటనతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం లావణ్య ఒక తమిళ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉండనున్నారని సమాచారం. భవిష్యత్తులో లావణ్య త్రిపాఠి నటించినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో, వరుణ్ తేజ్ కు జోడీగా మాత్రం నటించే ఛాన్స్ అయితే లేకపోలేదు.