బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తెలుగు తెరపై ఎవరు కనిపిస్తే.. ప్రేక్షకులకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుందో .. ఎవరి యాక్టింగ్ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుందో అలాంటి హాస్య నటుడే.. రాజబాబు. ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వులు పంచిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన కేవలం 45 ఏళ్ల ప్రాయంలోనే కన్నుమూశారు. విపరీతమైన మద్యం వ్యసనం కారణంగా లివర్‌లు దెబ్బతిని చనిపోవడం తెలుగు తెరకు ఆయనను దూరం చేసింది.
1937లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాజబాబుకు ఐదుగురు అక్కలు ఉండగా.. ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు. అంటే.. మొత్తంగా 9 మంది సంతానం. వీరిలో రాజబాబు వారసత్వంతో తెలుగు సినిమాల్లో పేరు తెచ్చుకున్నవారు అనంత్‌బాబు, చిట్టి బాబు. రాజబాబు.. పేరులోని బాబుతోనే వీరు కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక, రాజబాబు.. 1960లో తొలిసినిమా చేశారు. దీనికి ముందు ఆయన అనేక చిన్న చిన్న నాటికలు వేశారు.
ఈ పాత్రలను చూసిన గోవింద రాజుల సుబ్బారావు(అప్పటి పెద్ద ఆర్టిస్టు) రాజబాబును తెలుగు సినిమాకు పరిచయం చేశారు. అంతేకాదు.. తన ఇంట్లో పెట్టుకుని ఆయనకు నటనలో మెళకువలు కూడా నేర్పించారు. దాసరి నారాయణరావు.. తొలి సినిమా తాత మనవడులో హీరో వేషం వేసి.. సినిమాను ఒక రేంజ్‌కు తీసుకువెళ్లిన ఘనత కూడా రాజబాబుకు దక్కుతుంది. మహాకవి శ్రీశ్రీ సతీమణి సోదరి లక్ష్మి అమ్ములును వివాహం చేసుకున్న రాజబాబు.. శ్రీశ్రీకి తోడల్లుడయ్యారు.
ఈ దంపతులకు నాగేంద్రబాబు, మహేష్‌బాబు అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. వీరిని సినిమా రంగం వైపు తీసుకురాలేదు. ఇదిలావుంటే.. షూటింగుల సమయంలో రమాప్రభతో ఏర్పడిన పరిచయం.. సహజీవనానికి దారితీసింది. అయితే..అ ప్పటికే శరత్‌బాబుతో ఆమె ప్రేమలో పడడంతో .. ఆమె శరత్‌బాబును వివాహం చేసుకున్నారు. ఈ పరిణామంతోనే రాజబాబు కుంగిపోయి.. మద్యానికి బానిసయ్యారనే వాదన ప్రచారంలో ఉంది. రాజబాబు సోదరులు ప్రస్తుతం సినీరంగంలోనే ఉన్నారు.