పాపం అక్కినేని హీరోలు అంటే జాలి పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకటి కాదు రెండు సినిమాలు కాదు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు అక్కినేని ఫ్యామిలీలో తండ్రి నాగార్జున, ఇద్దరు కొడుకులు చైతన్య, అఖిల్ గత కొన్నేళ్ళుగా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. గత కొన్నేళ్లలో అసలు అక్కినేని ఫ్యామిలీ నుంచి చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒక్కటి కూడా లేదు. ఒక బంగార్రాజు సినిమా మాత్రమే హిట్ అయినా.. అది మల్టీ స్టారర్ సినిమా కావటం… పైగా అది కూడా సోగ్గాడే చిన్నినాయన లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా రావడం కలిసొచ్చింది.
అసలు గత కొన్నేళ్ళుగా నాగార్జున నటిస్తున్న సినిమాలు ఘోరంగా ఉంటున్నాయి. మన్మధుడు2 .ది ఘోస్ట్, ఆఫీసర్, ది వైల్డ్ డాగ్ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ సినిమాలతో నాగార్జున పరువు ఘోరంగా పోయింది. ఇక తాజాగా అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి భయంకరమైన డిజాస్టర్ గా నిలిచింది. అఖిల్ హీరో అయ్యి ఏడు సంవత్సరాల అవుతున్న ఇప్పటికీ సరైన హిట్ లేదు.
అఖిల్ కెరీర్ పై నాగార్జున ఫ్యామిలీ ఎంతో టెన్షన్ పడుతోంది. ఇక నాగచైతన్య కూడా వరుస ప్లాప్‌లు ఎదుర్కొంటున్నాడు. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ ఇలా వరుసగా డిజాస్టర్లు వచ్చాయి. ఇలా తండ్రి కొడుకులకు వరుసగా ప్లాప్‌లు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా కథలు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చైతు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు.
ఇక నాగార్జున రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక అఖిల్ యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కే సినిమాలో నటిస్తున్నాడు. అఖిల్- నాగార్జున సినిమాలకు కొత్త దర్శకులు పనిచేస్తున్నారు. ఈ సినిమాలతో అయినా తమ తలరాతలు మారతాయన్న ఆశలతో అక్కినేని హీరోలు ఉన్నారు మరి వీరి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.