విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుంది. సామాన్య కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మకుటం లేని మహారాజుగా వెలిగి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఆ తర్వాత రాజకీయాలలో కూడా ఎవ్వరికి అంతు చిక్కని రికార్డులను నెలకొల్పారు. అలాంటి ఈ యుగ పురుషుడికి ఈ రోజు లక్షలాది తెలుగు ప్రజలు శత జయంతి నీరాజనాలు పలుకుతున్నారు.
నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతి (మే 28)ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా రాములమ్మ విజయశాంతి ఎన్టీఆర్‌ను తలచుకున్నారు. ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మరింది. విజయశాంతి బాలనటిగా 14 ఏళ్ళ వయసులో కెరీర్ అప్పుడప్పుడే మొదలు పెడుతున్న సమయంలో ఎన్టీఆర్- ఏఎన్ఆర్ అపురూప కలయికలో వచ్చిన సత్యం శివం సినిమాలో చెల్లెలిగా నటించే అదృష్టం దక్కించుకున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం.. ఇటు విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఎదగడం జరిగిపోయాయి. 1985లో అయన చేతుల మీదుగా ప్రతిఘటనలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకోవడం ఓ అరుదైన జ్ఞాపకం. 1990లో ఎన్టీఆర్ తిరిగి మేకప్ వేసుకున్న చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఎన్టీఆర్ ఆ సినిమా డబ్బింగ్ స్టూడియోలో చెబుతున్న సమయంలో విజయశాంతి చిరంజీవి గ్యాంగ్ లీడర్ షూటింగ్ అదే ప్రాంగణంలో జరుగుతోంది. ఎన్టీఆర్ ని కలుద్దామని అక్కడికి వెళ్లిన ఆమెకు వెలుతురు సమస్య వల్ల ఆయన గుర్తుపట్టలేకపోవడంతో బాధ కలిగి వెనక్కి వచ్చేసిందట.
ఇక విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ మరుసటి రోజు మద్రాస్‌లోని విజయశాంతి ఇంటికి నేరుగా వెళ్లి.. షూటింగ్ వల్ల అదే రోజు ఉదయం విజయశాంతి హైదరాబాద్ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ ఆ టైంలో ఇంట్లో ఉన్న విజయశాంతి తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ ని కలిశారు. పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడితో ఆగకుండా హైదరాబాద్‌లో విజయశాంతికి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ కనుక్కుని స్వయంగా ఫోన్ చేసి మరోసారి సారీ చెప్పారు. అక్కడి నుంచి పరస్పరం ఆత్మీయ అనుబంధం కొనసాగి బంధువుల్లా మెలిగేవారు.
ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చిన సందర్భాలలో మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ మా ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేది. అదే గాకుండా, నేను వారిని కలవడానికి హైదరాబాదులో ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు. ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తిత్వం గురించి ఒక చిన్న ఉదాహరణ ఇది విజయశాంతి చెబితేనే తెలిసింది.