కర్ణాటక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్ నాడి విషయంలో ఆయా పార్టీలో మల్ల గుల్లాలు పడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ ప్రతిపక్ష కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరికొన్ని సర్వేలు హంగ్ తప్పదని చెబుతున్నాయి. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటక విధాన సభలో ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్ ఫిగర్ అయిన 113 సీట్లు వచ్చే అవకాశం లేవని తేల్చేసాయి. అయితే తాజాగా వచ్చిన ఒక సర్వే కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంతోషం నింపింది.
ఈ దిన సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ కి అధికారం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 స్థానాలు కంటే ఎక్కువగా 132 నుంచి 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఈ దిన సర్వే తేల్చి చెప్పింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు అనేక రకాల సర్వేలు చేయిస్తూ ఉంటాయి. ఫలితాలను మాత్రం తమకు అనుకూలంగా ప్రకటించుకుంటూ ఉంటాయి.
కొన్ని థర్డ్ పార్టీలు సర్వేలు చేపట్టిన ఫలితాల ప్రకటనలో రాజకీయ పార్టీల ప్రమేయం కాస్త కూస్తో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 132 నుంచి 140 స్థానాల్లో గెలుపు ఖాయమని.. 57 నుంచి 65 సీట్లతో బిజెపి రెండో స్థానానికి పరిమితం అవుతుందని 19 నుంచి 25 సీట్లతో జెడిఎస్ మూడో స్థానంలో ఉంటుందని ఈ సర్వే రిపోర్ట్ చెప్పింది. ఇతరులు 5 సీట్లలో ప్రభావం చూపుతారని సర్వే స్పష్టం చేసింది.
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 38% ఓటు బ్యాంకు రాగా ఈసారి 43 శాతం వరకు దక్కే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేసింది. బిజెపి ఓటు షేరు మూడు శాతం వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే మళ్లీ బిజెపి ప్రభుత్వమే తిరిగి రావాలని 33 శాతం మంది కర్ణాటక ప్రజలు కోరుకుంటుంటే.. 67 శాతం మంది ఈ ప్రభుత్వం తమకు అస్సలు వద్దని చెబుతున్నారు.
హైదరాబాద్ కర్నాటక ( కల్యాణ కర్నాటక) ప్రాంతంలో మొత్తం 40 స్థానాలు ఉండగా అందులో 31 నుంచి 37 సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమట. బీజేపీ, జేడీఎస్ లు రెండూ.. ఇక్కడ 2నుంచి 4 స్థానాలకే పరిమితం అవుతాయని తేలింది. ముంబై కర్నాటకలో 50 స్థానాలకు కాంగ్రెస్ 40-46 సీట్లు, బీజేపీ 3-7, జేడీఎస్ 0-2 సీట్లు గెలుస్తాయట. అయితే కోస్టల్ కర్నాటకలో బీజేపీదే పైచేయి అని, మిగతా చోట్ల హోరాహోరీ పోరు సాగుతుందని సర్వేలు చెబుతున్నాయి.