రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది ముందు. టీడీపీ చేసిన ప్రయత్నం అద్భుతః అని సర్వత్రా వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరాన్ని గత ఏడాది మే 28నే ప్రకటించినా.. నెల రోజుల పాటు మరింత ఊపు తీసుకురావాలనే ఉద్దేశంతో టీడీపీ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. వివాద రహితుడు.. అందరికీ కావాల్సిన వ్యక్తిగా.. పేరు తెచ్చుకున్న రజనీకాంత్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం.. అంచనాలను మించింది.
ఇప్పటి వరకు.. తెలుగు ఇండస్ట్రీపైనే ఆధారపడిన టీడీపీ..తాజాగా తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడం.. రజనీని ఆహ్వానించడం.. ఆయన చేసిన ప్రసంగం వంటివి పార్టీకి బూస్ ఇచ్చాయనే టాక్ వినిపిస్తోంది. ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ.. ఏరికోరి రజనీని ఆహ్వానించడం.. ఆయన కూడా పిలవగానే రావడం వంటివి టీడీపీకి కలిసి వచ్చింది. చంద్రబాబు విజన్‌ను ఆయన ఆవిష్కరించారు. విజన్ 2020 నుంచి విజన్ 2040 వరకు బాబు దూరదృష్టిని (విజన్) ఆయన కొనియాడారు.
అదేసమయంలో పార్టీలో చంద్రబాబు చేస్తున్న సేవలను ఒక్క వాక్యంలోనే ఆయన చెప్పుకొచ్చారు. ఇది టీడీపీకి ఎంతో కలిసివ చ్చే పరిణామంగా పార్టీ సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఏడాది పాటు పార్టీలో రజనీ గాలి కొనసాగుతుందని.. తిరుగు ఉండదని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జరుగుతున్న ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దరిమిలా.. రజనీ వంటి వ్యక్తి ద్వారాలబ్ధి చేకూరే అవకాశం మెండుగా ఉందని అంచనా వేస్తున్నారు.
పల్లెలు, పట్ణణాలే కాకుండా.. గ్రామీణ స్థాయిలోనూ గుర్తింపు ఉన్ననటుడు.. రజనీకాంత్. ఆయన చెప్పింది బాగానే జనంలోకి వెళ్తుందనే నమ్మకం.. టీడీపీకి కొత్త బలాన్ని ఇస్తాయని చెబుతున్నారు. ప్రతి విషయాన్నీ ఆకళింపు చేసుకున్న రజనీ.. సుదీర్ఘ అనుబంధాన్ని ఎన్టీఆర్ కుటుంబంతో కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇటు ఎన్టీఆర్ అభిమానులు.. అటు పార్టీ అభిమానులను ఏకతాటిపైకి తీసుకురావడంలో రజనీ రాక ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా.. ఏడాదిపాటు.. తిరుగు ఉండదనే అంచనాలు వస్తున్నాయి.