రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీకి లెక్కకు మిక్కిలిగా ఎంపీలు ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో లభించారు. దీంతో రాష్ట్ర సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని, రాష్ట్ర ప్రజల గళం ఢిల్లీలో బలంగా వినిపి స్తుందని అందరూ ఆశ పెట్టుకున్నారు. కానీ,ఎన్నికలు పూర్తియి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు గడి చిన తర్వాత కూడా ఇప్పటి వరకు వైసీపీ తరఫున లెక్కకు మిక్కిలిగా గెలిచిన ఎంపీలు కేంద్రంలో తమ వాయిస్‌ను వినిపించలేక పోతున్నారు. ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను ఇవ్వండి. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను. కేంద్రాన్ని ము ప్పుతిప్పులు పెట్టి అయినా.. రాష్ట్ర హక్కులు సాధిస్తాను
అంటూ వైసీపీ అదినేత జగన్ ప్రజలకు వాగ్దానం చేశా రు.
దీంతో 25కు 25 కాకపోయినా 22 మంది ఎంపీలను ప్రజలు వైసీపీకి అందించారు. దీంతో ఏపీ సమస్యలు, ముఖ్యంగా ప్రజలకు సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ దూకుడుగా ఉంటుందని, తమకు మేలు జరుగుతుందని భావించారు. కానీ, ఇప్పటి వరకు వైసీపీ ఎంపీలు కానీ, పార్టీ అధినేత, సీఎం జగన్ కానీ ఈ విషయంలో నోరు మెదపలేదు. ఎన్నికలు పూర్త యి.. ఇంకా సీఎంగా ప్రమాణం చేయకముందుగానే ఢిల్లీ వెళ్లి అప్పటికే ప్రమాణం చేసిన ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు జగన్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడకూడదని తాను భగవంతుణ్ని కోరుకున్నానని, కానీ ఇప్పుడు పూర్తి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఈ నేపథ్యంలో కేంద్రంపై పెత్తనం చేసే అవకాశం మనకు లేకుండా పోయిందని చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా సహా ఏ విషయాన్నయినా.. కేంద్రం వద్ద మనం ప్లీజ్.. ప్లీజ్ అంటూ బ్రతిమాలడం తప్ప చేయగలి గింది ఏమీ లేదని స్పష్టం చేసేశారు. దీంతో అవాక్కవడం ప్రజల వంతైంది. అయితే, ఈ ఆరు మాసాల్లో పోనీ.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ అయినా వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై ప్రశ్నించారా? అంటే.,. అది కూడా లేదని తాజాగా స్పస్టమైంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం నుంచి ఇదే తరహా సమాధానం వచ్చింది. గడిచిన ఆరు మాసాల్లో మమ్మల్ని ఎవరూ కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు అన్ని వేళ్లూ.. వైసీపీవైపే చూపిస్తున్నాయి. అసలు ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు మౌనం వహించడం ఎందుకు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. దీనికి విపక్షాలు చెబుతున్న కారణాలు..కేవలం జగన్‌పై నమోదైన కేసులేనని అంటున్నారు. కేంద్రానికి పదే పదే చికాకు కలిగిస్తే.. కేసుల తుట్టె కదులుతుందని జగన్ భయపడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 22 మంది ఎంపీలు ఉన్నా.. ఆయన రాష్ట్రానికి ఏమీ చేయలేక పోతున్నారని అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి.