సొంతపార్టీ ఎమ్మెల్సీకు తెలుగుదేశం ఝలక్‌

ఏపీ విపక్ష పార్టీ టీడీపీ తన సొంత ఎమ్మెల్సీలకే ఝలక్‌ ఇచ్చింది. శాసన మండలిలో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టాల రద్దుకు సంబంధించిన అంశంలో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఇద్దరు పార్టీ సభ్యులకు షాకిచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌కు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే అధికార, పాలన వికేంద్రీకరణ బిల్లులను, క్యాపిటల్‌ ఆఫ్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చట్టం రద్దుకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమోందించిన విషయం తెలిసిందే.

శాసనమండలి ఆమోదం కోసం ఆ బిల్లులను పంపింది. ఈ సందర్భంగా ఆ బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ రూల్‌ ఆఫ్‌ 71ను ప్రవేశపెట్టింది. దీంతో దానిపై శాసనమండలి చైర్మన్‌ ఓటింగ్‌ నిర్వహించారు. అయితే అందులో వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా, సొంత పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి తమ నిర్ణయాన్ని పక్రటించి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ భావించింది. ఈ మేరకు వారిపై వేటువేయాలని మండలి చైర్మన్‌కు పార్టీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడంతా స్పీకర్‌ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Tags: chairman shareef, tdp mlc suniitha. shivanathreddy