వైసీపీ ప్రభుత్వానికి షాక్‌.. సీఆర్డీఏ రద్దుపై కోర్టులో పిటిషన్‌

అంతా సజావుగా సాగిందని, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్న తరుణంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. అసెంబ్లీ చేసిన బిల్లులను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టు ఆశ్రయించారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విషయంలోకి వెళ్తే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ (క్యాపిటల్‌ రీజినల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) చట్టం రద్దు, తదితర బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించింది. మొదటి రోజునే ఆయా బిల్లులను సంబంధిత మంత్రులు బుగ్గన రాజేంద్రప్రసాద్‌, బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు అందుకు మద్దతు తెలిపిరు. దీంతో బిల్లులు ఆమోదం పొందాయి. వాటిని శాసనమండలి ఆమోదానికి పంపారు.

ఇదిలా ఉండగా అందులో సీఆర్డీఏ చట్టం రద్దును సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఇద్దరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి అనుకోని షాక్‌ తగిలింది. ప్రభుత్వం చేసిన బిల్లును సస్పెండ్‌ చేయాలని పిటిషన్‌ దారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆ పిల్‌లో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులను చేర్చారు. ఈ పిటిషన్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిగాక మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని సవాల్‌ చేస్తూ ఇప్పటికే పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని సుమారు 37 మంది రైతులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆ పటిషన్‌ ఇవాళ విచారణకు రానుండడం గమనార్హం.

Tags: AP HIGH COURT, capital amaravathi, CRDA, PIL