ఎవరు ఎన్ని చెప్పినా ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీలు వరుసపెట్టి బీజేపీలోకి, వైసీపీలోకి చేరిపోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర పార్టీకి చెందిన కీలక నేతలను ఆకర్షిస్తుంటే.. ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బిజెపికి చెందిన కరుడుగట్టిన కాషాయ వాది, ఆర్ఎస్ఎస్ నేత.. ఆ పార్టీ మాజీ ఎంపి గోకరాజు గంగరాజును వైసిపి లాగేసింది. గోకరాజు గంగరాజు వైసీపీలో చేరడం బీజేపీ వర్గాలకు సైతం అంతుపట్టడం లేదు. అయితే జగన్ ఈ విషయంలో బీజేపీకి షాక్ ఇవ్వడం వెనక మరో షాకింగ్ న్యూస్ కూడా ఉందని తెలుస్తోంది.
అదే వైసీపీకి చెందిన ఎంపీ బీజేపీలోకి జంప్ చేయడం… వైసీపీకి రఘురామకృష్ణంరాజును బిజెపి తన వైపు తిప్పుకునేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ గీసిన గీత దాటి కూడా రఘురామకృష్ణంరాజు దాటేసి బీజేపీ జాతీయ నాయకత్వంతో టచ్లో ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే విజయసాయి రెడ్డికి, మిథున్‌రెడ్డికి దక్కని ప్రాధాన్యత సైతం బిజెపి దగ్గర రఘురామకృష్ణంరాజుకు దక్కుతోంది. తమ పార్టీ ఎంపీని లాక్కుంటే మేం ఊరుకుంటామా అన్నట్టుగా… వైసిపి అదే బిజెపికి చెందిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీ మొత్తాన్ని లాగేసింది.
కృష్ణానది కరకట్ట సమీపంలో గోకరాజు ఫ్యామిలీకి సంబంధించిన విలువైన గెస్ట్ హౌస్ ఉంది. దానిపై విమర్శలు వస్తుంటాయి. అయితే అంతకు మించి అక్కడ ఆయనకు విలువైన భూమి ఉందట. మీరు మాకు మద్దతు ఇస్తే మీ ఆస్తి పదిలం గా ఉండేలా చేస్తాను అని వారికి వైసీపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు టాక్ఈ. క్రమంలోనే గంగరాజుకు రాజ్యసభ సీటు కూడా ఇస్తామని హామీ వచ్చిందట. ఇక ఇప్పటి వరకూ వైసీపీతో దాగుడుమూతలు ఆడిన రఘురామకృష్ణంరాజు ఇక ఓపెన్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11న ఆయన ఢిల్లీలో అదిరిపోయే రేంజ్ లో పార్టీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు… హోంమంత్రి అమిత్ షా కూడా వస్తారని చెబుతున్నారు. ఈ విందు తర్వాత రఘురామకృష్ణంరాజుతో పాటు మరి కొంత మంది వైసీపీ ఎంపీలు కూడా గోడ దూకే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటివరకు కోల్డ్ వార్ లా బిజెపి, వైసీపీల మధ్య నడుస్తున్న వ్యవహారం.. ఇక డైరెక్ట్ వార్ గా మారిపోయే అవకాశం కనపడుతోంది. అదే జరిగితే జగన్‌ను బీజేపీ కేసుల పరంగా కూడా మరింతగా టార్గెట్ చేస్తుందనడంలో సందేహం లేదు.