వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయా..? ఎంపీలకు, ఎమ్మెల్యేలకు గ్యాస్ వచ్చిందా అంటే ఆ పార్టీ శ్రేణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నిన్నా మొన్నటి వరకు కోల్డ్‌వార్‌గా కొనసాగినా..ఇటీవల అదికాస్త ముదిరి పాకనా పడ్డట్లు సమాచారం. అయితే ప్రభుత్వ, పార్టీ నిర్ణయాల్లో ఎంపీలను కావాలనే అధిష్ఠానం దూరం పెడుతోందనే వాదనను ఎంపీలు వినిపిస్తున్నారట. ఎంపీల అనుచరులు కూడా ఎమ్మెల్యేల అనుచరులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అన్నింటా తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు ఖాతరు చేయడం లేదని వాపోతున్నారట.
దీంతో పార్టీ నేతల మధ్య రాజకీయం ముదురుతోంది. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులో కూడా ఎంపీలను ఎమ్మెల్యేలు ఇన్ వాల్వ్ చేయడం లేదని సమాచారం. ప్రొటోకాల్ కూడా పాటించకుంటే తాము ఎంపీలుగా ఉండి ఏం లాభమని కొంతమంది కుంగిపోతున్నారట. వాస్తవానికి ఎంపీలకు ఏమాత్రం సందు ఇవ్వొద్దు అనేదే ఎమ్మెల్యేల ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటు సభ్యులకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పార్లమెంటు సభ్యులను జగన్ దూరం పెడుతున్నారన్నది పార్టీలోనే జరుగుతున్న చర్చ.
నిజానికి పార్లమెంటులోనూ, ఢిల్లీ స్థాయిలోనూ చక్రం తిప్పగలిగింది, నిధులు, ప్రాజెక్టులు తీసుకురాగలిగింది పార్లమెంటు సభ్యులు మాత్రమే. అయితే వారిని ఉత్సవ విగ్రహాలుగా జగన్ ప్రభుత్వం చూస్తుందన్నది వారి నుంచే విన్పిస్తున్న మాట. కొందరు వైసీపీ ఎంపీలు అసంతృప్తితో ఉండటానికి కారణం ప్రధానంగా ఎలాంటి పదవులు దక్కకపోవడమేనంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలకు గాను 22 చోట్ల వైసీపీ ఎంపీలు గెలిచారు. వీరిలో సీనియర్లు ఒకరిద్దరు ఉన్నప్పటికీ మిగిలిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే కావడం గమనార్హం.
పార్లమెంటు సభ్యుల్లో అసహనాన్ని గమనించిన విజయసాయిరెడ్డి వారితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించడం పార్టీలో పరిస్థితికి అద్దం పడుతోందని శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఎంపీలకు..ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కుదుర్చే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పడటం లేదు. నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు మొదలు అన్ని వ్యాపారాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. నరసారావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని విడుదల రజిని జీర్ణించుకోలేకపోతున్నారట. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు ఏమాత్రం పడటం లేదంట. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ను ఆయన సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. పార్టీ కార్యక్రమాలకు గాని, ప్రభుత్వసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదట. ఆయన పరిధిలోని ఎమ్మెల్యేల్లో దాదాపుగా సీనియర్లే కావడంతో ఇబ్బందులు తప్పడం లేదంట. అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు జిల్లా ఎమ్మెల్యేలకు ఏమాత్రం పొసగడం లేదంట.
వీరు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. అలాగే నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయన సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు సయితం లెక్క చేయడం లేదని సమాచారం. ఆయన పార్టీకి ధిక్కారస్వరం వినిపిస్తున్నారని ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన్ను పట్టించుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారని రామరాజు అనుచరులు వాపోతున్నట్లు సమాచారం. ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తుండటం గమనార్హం.