గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఎట్టకేలకు చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. తన సహజ శైలికి భిన్నంగా టీడీపీ అధినేత వేగంగా, సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైన అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టి, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే చంద్రబాబు ఒక ని ర్ణయానికి వస్తారు. అయితే తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో మాత్రం చంద్రబాబు 24 గం టల్లోనే నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చంద్రబాబు పార్టీ సస్పెన్షన్లకు దూరంగా ఉంటారు. నేతలెవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, పార్టీ లైన్ దాటి ప్రవర్తించినా ఆయన తొందరపడి సస్పెన్షన్ చేసిన దాఖలాలు కనిపించవు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు నేతలు పార్టీని వదిలి వెళ్లారు. అంతేగాక అనేకమంది టీడీపీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. అయినప్పటికీ చంద్రబాబు వారిని సస్పెండ్ చేయలేదు. వారంతట వారే వెళ్లిపోయారు. తర్వాత అదే నేతలను తిరిగి చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు.
ఇక అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నేతలెవరినీ సస్పెండ్ చేయలేదు. కరణం బలరాం, అయ్యన్న పాత్రుడు, జేసీ దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడినా వారిపై వేటు వేయలేదు. సరికదా వారిని పిలిచి మాట్లాడారు. వారిపై ఎలాంటి చర్యలకు దిగలేదు. దీంతో చంద్రబాబుకు చర్యలు తీసుకునే ధైర్యం లేదన్న గుసగుసలు కూడా అప్పట్లో విన్పించాయి. అయితే తాజాగా వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో కొందరు నేతలు స్వాగతిస్తున్నారు.
అయితే పార్టీతో పాటు చంద్రబాబు, నారా లోకేష్ లను విమర్శించడం వల్లనే వల్లభనేని వంశీని సస్పెండ్ చేసిన బాబు, అదే వైఖరి అవలంభిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బీజేపీ నేతలను తరచూ కలుస్తున్నా ఆయనపై చర్యలకు ఉపక్రమించడంలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వ్యక్తిగతంగా తమపై దుమ్మెత్తి పోసిన వంశీని వదిలించుకోవడమే మంచిదని చంద్రబాబు సత్వర నిర్ణయం తీసుకున్నారని, గంటా విషయంలో సామాజికవర్గం కోణంలో వెనక్కు తగ్గుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.