రికార్డుల్లో ప్రిన్స్‌ మహేష్‌బాబుకు ‘సరిలేరు’

సంక్రాంతికి ముందే విడుదలైన ప్రిన్స్‌ మహేష్‌బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తున్నది. విడుదలై ఎనిమిది రోజులైన ఇంటా బయటా భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకెళ్తున్నది. తొలివారంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.100కోట్లకు పైగా రాబట్టి నాన్‌ బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన వసూల్లను చూస్తే మరిన్ని రికార్డులను నమోదు చేయడం ఖాయమని సినీ ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మహేష్‌బాబు హీరోగా, రష్మికమందన్న హీరోయిన్‌గా, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11న విడుదలైంది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లేడీ అమితాబచ్చన్‌గా కీర్తి గడించిన విజయశాంతి చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం వసూళ్లలో దూసుకుపోతున్నది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం విడుదలైన ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల షేర్‌ను సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అందులో సీడెడ్‌లో రూ.13.25 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ. 6.02 కోట్లు, నెల్లూరులో రూ. 3.32 కోట్లు, కృష్ణలో రూ.7.34 కోట్లు, గుంటూరులో రూ. 8.51 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 9.04 కోట్లు, నైజాంలో రూ. 29.8కోట్లను వసూలను చేసినట్లు సినీ ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక యూఏలో 14.9 కోట్లు, కర్ణాటకలో రూ. 7కోట్లు, తమిళనాడులో రూ. 1కోటి, మిగతా ప్రాంతాల్లో రూ. .5కోట్లను రాబట్టినట్లు వారు వెల్లడించడం గమనార్హం. అంతేకాదు ఈ చిత్రం అమెరికాలో రెండు మిలియన్‌ క్లబ్‌లో చేరింది. ప్రిన్స్‌ నటించిన మూడు సినిమాలు వరుసగా ఆ జాబితాలో చేరడం విశేషం.

Tags: Collections, MaheshBabu, SARILERU NEKEVVARU