టీడీపీలో సస్పెండ్ అయిన వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదా? అంటే ప్రస్తుతం ఆయన మాటలు బట్టి చూస్తుంటే రాజీనామా చేసే ఆలోచనే లేదనే తెలుస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు ఉండే స్థానంలోనే కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ… తన నియోజకవర్గ సమస్యలని వివరించడానికి తాను సీఎంని కలిశానని, కానీ తాను అలా చేసినందుకే టీడీపీ తనని సస్పెండ్ చేసిందని, అయినా సరే తాను టీడీపీ వాళ్ళతో కొనసాగలేనని, తనకు అసెంబ్లీలో వేరే సీటు కేటాయించాలని స్పీకర్ ని కోరారు.
అలాగే తనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఉన్న నియోజకవర్గ ప్రజలు కోసం ఆ పని చేయలేనని, కాబట్టి తనకు ప్రత్యేకంగా సీటు ఇవ్వాలని అన్నారు. అయితే దీనిపై స్పందించిన స్పీకర్…రూల్స్ చూసి ప్రత్యేకంగా సీటు ఇచ్చే విషయం పరిశీలిస్తానని చెప్పారు. ఇక వంశీ మాటలని బట్టి చూస్తుంటే ఆయన ఇప్పటిలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆలోచన లేదని తెలిసిపోతుంది.
అయితే వంశీ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఇప్పుడే రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వచ్చేస్తాయి. ఇందులో గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే చెప్పలేం. గన్నవరంలో టీడీపీ కూడా బలంగానే ఉంది. పైగా జగన్ పాలనపై ప్రజలందరూ సంతృప్తిగా ఏమి లేరు. మరి ఇలాంటి సమయంలో ఉపఎన్నిక వస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం.
అయితే త్వరలో పంచాయితీ, స్థానిక సంస్థలు జరగనున్నాయి. ఇందులో సత్తా చాటితే తర్వాత ఆలోచించి రాజీనామా చేయొచ్చు. గన్నవరంలో వైసీపీ జెండా ఎగిరేలా చేస్తే అప్పుడు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లొచ్చు. అప్పటివరకు వంశీ రాజీనామా చేయడం కష్టమే. ఇలాగే వైసీపీకు మద్ధతుదారుడుగా కొనసాగుతారే తప్ప, రాజీనామా చేసే సాహసం చేయరు.