మూడు రాజధానుల ఏర్పాటు వెనుక ఆంతర్యమేమిటీ?

ఆంధ్రప్రదేవ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తెరమీదకు తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నది. రోజురోజుకూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. ఇప్పటికే రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల ప్రజలు దీనిపై నిరసనల బాట పట్టగా ఆయా చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష టీడీపీ నేతలు అధికార వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అవసరమేమిటనీ, అలా ప్రతిపాదించడం వెనుక ఆంతర్యమేమిటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సైతం పలు అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడంలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడారు. చాలా రాష్ట్రాల్లో రాజధానులు ఒకే చోట ఉన్నాయని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని, మరి ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని రాజా డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల యోచనను వైసీపీ ఇకనైనా వెంటనే విరమించుకోవాలని హితవుపలికారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Tags: ap capital amaravathi, cpi leder d raja coments, demands