మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై రెఫరెండం పెట్టాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్‌విసిరారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో నిర్వహించిన బోగి మంటలు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత మూడు రాజధానుల ఏర్పాటు చేసిన నియమించిన జీఎస్‌రావు కమిటీ ఇచ్చిన నివేదిక పత్రాలను, బోస్టన్‌ నివేదిక పత్రాలను ఆ మంటల్లో వేసి కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి తరలింపు సునామీ వంటిందని, అందుకు సహకరించిన ఏ రాజకీయ పార్టీ అయినా అందులో పడి కొట్టుకుపోవాల్సిందేనని హెచ్చరించారు. అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని అని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందని, అందుబాటులో ఉంటుందని, ఒక్క పైసా ఖర్చు లేకుండా రాజధానిగా కొనసాగించుకోవచ్చని, ఇప్పటికే అందుకు కావాల్సిన వసతులను, పరిపాలన భవనాలను సమకూర్చుకున్నామని ఆయన వివరించారు. కార్యాలయాలను తీసుకెళ్లినంత మాత్రాన విశాఖ అభివృద్ధి చెందనని సూచించారు. మూడు రాజధానుల ఏర్పాటును ఒక్క వైకాపానే సమర్థిస్తున్నదని, దానిని రెఫరెండం పెట్టాలని, అప్పుడు తిరిగి వైకాపానే గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చంద్రబాబు సవాల్‌విసిరిరారు. ప్రపంచమంతా ఆంధ్రను చూసి నవ్వుకుంటున్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఎంతవరకైనా పోతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: ap capital amaravathi, chandrababu naidu, vijayawada benj circle