ప్రిన్స్‌ మహేష్‌బాబు సినిమాకు తమన్‌ స్వరాలు..!

సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్టు కొట్టిన ప్రిన్స్‌ మహేష్‌బాబు మంచి జోరుమీదున్నాడు. ఏమాత్రం గ్యాప్‌ తీసుకోకుండానే వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. తన తరువాతి సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లే దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు. ఇక మహేష్‌ తన 27వ సినిమాను మహర్షి సినిమాతో బ్లాక్‌బాస్టర్‌ మూవీని అందించిన వంశీ పైడిపల్లితోనే చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు స్వరాలను సమకూర్చేది ఎవరనేది ఇప్పటి వరకు నిర్ణయించలేదు. అయితే ప్రస్తుతం ఆ లక్కీ చాన్స్‌ సంగీత దర్శకుడు తమన్‌కు దక్కినట్లు టాలివుడ్‌ వర్గాలు తెలుపుతున్నాయి.

తమన్‌ ఇటీవలే అల వైకుంఠపురంలో సినిమాకు అందించిన స్వరాలు అత్యంత జనాదరణ పొందాయి. అభిమానులను ఉర్రూతలుగిస్తున్నాయి. ముఖ్యంగా సామజవరగమన పాట ఆల్‌ టైం రికార్డుగా నిలిచిపోతున్నది. ఈ నేపథ్యంలో తన తరువాతి సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్‌ను ప్రిన్స్‌ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాను వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి సంక్రాంతికి కానుకగా ఇవ్వాలని భావిస్తున్నట్లు టాలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనను ఆ చిత్రయూనిట్‌ ప్రకటించకపోవడం గమనార్హం. అయితే ప్రిన్స్‌, తమన్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తమన్‌, మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఇప్పటికే బిజినెస్‌ మ్యాన్‌ సినిమా రాగా, అందులో సారోస్తారొస్తారా పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. అల వైకుంఠపురంలో చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన తమను ఇప్పుడు అంతకంటే మంచి స్వరాలను సమకూర్చుతాడో ? చూడాలి మరి.

Tags: hero maheshbabu music director thaman, vamshi pidipally