సెలబ్రటీలు ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అవి బెడిసికొడుతుంటాయి. తాను ఒకటి అనుకుంటే జరిగింది మరొకటయింది. కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంటాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది ప్రముఖ హిరోయిన్ సంజన ఉదంతం. బుజ్జిగాడు సినిమాతో తెలుగులో వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు అటు తర్వాత సర్దార్ గబ్బార్‌సింగ్, దండుపాళ్యం సినిమాల్లోనూ మెరిసింది. అటు తర్వాత తెలుగు తెరకు కనుమరుగయినా కన్నడలో బిజీ హిరోయిన్‌గా కొనసాగుతున్నది. అదే విధంగా తమిళ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంటున్నది.
ఇదిలా ఉండగా ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాను చూసేందుకు బెంగుళూరులోని థియేటర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో కారును నడుపుతూ సెల్ఫీ దిగింది. అక్కడితో ఆగకుండా ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అవికాస్తా ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లాయి. ఏముంది వారు వెంటనే స్పందించారు. విచారణకు హాజరు కావాలని నటి సంజనకు తాఖీదులను పంపించారు. అనంతరం విచారణకు హాజరైన ఆమెకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. సెలబ్రిటీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని హితవుపలికారు. అదీగాక కారును డ్రైవ్ చేస్తూ సెల్ఫీ తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. సెలబ్రిటీలను లక్షలమంది ఫాలో అవుతుంటారని, అందరకీ ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని సూచించారు. ఇకనైనా ఈ బెంగుళూరు భామా హుందా వ్యవహరిస్తుందో? లేదో చూడాలి.