జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. ఈ సారి ఏకంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ పోరడతానని శపథం చేసి సంచలనం రేపారు. అమరావతిలోని పార్టీ కార్యాలయం నుంచి రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలను కలిసేందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు వచ్చి తమ గోడును పవన్‌కల్యాణ్ ఎదుట వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాఆరు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం అదే కూల్చివేతకు గురవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గద్దె దింపేవరకూ తాను విశ్రమించబోనని శపథం చేశారు. సెక్రెటేరియట్ ఉద్యోగులు కూడా రైతులకు అండగా ఉండాలని, ఏదయిన సమస్య వచ్చినప్పుడు వారు కూడా ఉద్యోగులకు అండగా ఉంటారని సూచించారు.
ఇదిలా ఉండగా మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అటు బీజేపీ, ఇటు జనసేన ఇటు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. అందుకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రేపు ఢిల్లీలో ఇరుపార్టీల నేతలు కీలక భేటీ నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఢీల్లీలో ఉండగా, ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు, పవనకల్యాన్ రేపు హస్తినకు తరలివెళ్లనున్నారు. రాజధాని అంశంపై ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సర్వత్రా ఉత్కంఠతను రేపుతున్నాయి. కమలం పెద్దలతో కలిసి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారోనని ఆసక్తి నెలకొంది.