తిరుమల తిరుపతి లడ్డు.. ఇకపై రాయితీ కట్టు

తిరుమల తిరుపతి వేంకటేశ్వర భక్తులకు చేదు వార్త. స్వామివారి లడ్డూ ఇక ప్రియం కానుంది. కాలినడకన కొండపైకి చేరుకునే భక్తులకు ఇక నుంచి ఒక్క లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు. మరో లడ్డూ కావాలంటే రూ. 50 చెల్లించాల్సిందే. ఈ ఏకాదశి నుంచే ఈ విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి కసరత్తు చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలకు దేశవిదేశాల నుంచి నిత్యం ఎంతో మంది భక్తులు దర్శిస్తుంటారు. వారిలో చాలా మంది కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. వారికి టీటీడీ బోర్డు ఇప్పటి వరకు రూ. 10కి రెండు లడ్డూలు, మరో రెండు లడ్డూలను రూ.25 చొప్పున మొత్తంగా రూ.70 రూపాయాలకు నాలుగు లడ్డూలను అందజేస్తున్నది. ఇలా నిత్యం సుమారు 20 వేల మందికి లడ్డూలను పంపిణీ చేస్తూంటుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉద్యోగులకు రూ. 5కే లడ్డూను విక్రయిస్తున్నది. ప్రస్తుతం టీటీడీ ఆ రాయితీలను ఎత్తేస్తున్నది. ఇకపై కాలినడక తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి కేవలం ఒక లడ్డూను మాత్రమే అందజేయాలని నిర్ణయించారు. అదనంగా లడ్డూలు కావాలనుకుంటే ప్రతి లడ్డూకు రూ. 50 చొప్పున చెల్లించాల్సిందే. లడ్డూ తయారీ ఖర్చుతో కూడుకోవడం, భారంగా మారడం వల్లే రాయితీలను ఎత్తేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నారు.