ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని నిలబెట్టుకునేందుకు టీడీపీ చేస్తన్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. కీలక నాయకులు పార్టీకి ఇప్పటికే దూరమయ్యారు. కొందరు పార్టీ మారగా.. మరికొందరు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించేందుకు చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారు. ఈక్రమంలోనే ఆయన పార్టీ సీనియర్లు, వృద్ధ నేతల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
ప్రతి జిల్లాలోనూ పార్టీకి సీనియర్లు ఉన్నారు. అయితే, ఇప్పుడు వారంతా కూడా పూర్తిగా మౌనంగా ఉండడం, పార్టీ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ వ్యూహాల గురించి కానీ పట్టించుకోకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సీనియర్ నాయకులకు వారి వారసులకు కూడా చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. అయితే, వీరంతా కూడా పూర్తిగా విఫలమయ్యారు. గెలుపు, ఓటములు పక్కన పెడితే.. పార్టీని బతికించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు మాట.
కానీ, సీనియర్లు మాత్రం ఏ ఒక్కరూ కూడా బయటకు రావడం లేదు. వీరిలో గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి సాంబశివరావు(ఈయన నరసరావు పేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.), కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి(ఈయన కుమారుడు పత్తి కొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు), గుంటూరుకే చెందిన మాజీ మంత్రిగాదె వెంకట రెడ్డి(ఈయన ఎన్నికల సమయంలో బాపట్ల ఇవ్వాలని కోరారు అయితే, చంద్రబాబు ఇవ్వలేదు.)
అదేవిధంగా అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్, ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడి సిద్దా రాఘవరావు(ఈయన తన సొంత నియోజకవర్గం దర్శి నుంచి పోటీ చేసేందుకు రెడీ అయినా చివరి నిముషంలో మా ర్చారు), కృష్ణాజిల్లాలో అవనిగడ్డ నుంచి ఓడిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్, నెల్లూరులో ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిన బొల్లినేని కృష్ణయ్య ఇలా భారీ సంఖ్యలో సీనియర్లు ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు.
పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ.. వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నా.. వారు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. కనీసం పార్టీ తరఫున గళం కూడా వినిపించడం లేదు. దీంతో వారందరూ కలిసి రావాలంటూ.. అంతర్గతంగా వారికి చంద్రబాబు వర్తమానం పంపారు. అయినా కూడా వీరిలో ఎవరూ కూడా ముందుకు రాకపోగా.. పార్టీలో కూడా క్రియాశీలంగా పనిచేయడం లేదు. దీంతో అసలు వీరిలో ఎంతమంది పార్టీలో కొనసాగుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.